గాయని వాణీ జయరాం అంత్యక్రియలు పూర్తి

ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం అంత్యక్రియలు తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో ఆదివారం పూర్తి అయ్యాయి. శనివారం చెన్నైలోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె నుదుటిపై గాయాలు ఉండడంతో ఆమె భౌతికకాయానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఆమె భౌతికకాయానికి వివిధ రంగాల ప్రముఖులు, అభిమానులు కడసారి నివాళులు అర్పించారు.

వాణీజయరాం ఇప్పటి వరకు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురీ.. ఇలా 14 భాషల్లో దాదాపు 8వేలకు పైగా పాటలు ఆలపించారు. తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్‌ 30న జన్మించిన ఆమె అసలు పేరు కలైవాణి. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో వాణీజయరాం ఐదో సంతానం. ఇటీవలే కేంద్రం ప్రభుత్వం ఆమెకు పద్మభూషణ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

2018లో ఆమె భర్త జయరాం మృతి చెందారు. అప్పటినుంచి చెన్నైలోని హడోవ్స్ రోడ్ లోని తమ నివాసంలో ఒంటరిగా ఉంటున్నారు. నిన్న పనిమనిషి ఆమె ఇంటికి రాగా, ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో, వాణీ జయరాం సోదరికి సమాచారం అందించారు. వారు ఇంట్లోకి ప్రవేశించి చూడగా, వాణీ జయరాం బెడ్ రూంలో విగతజీవురాలిగా పడి ఉన్నారు. ముఖంపై గాయాలు ఉండడంతో పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు.