జగద్గిరిగుట్ట లో విషాదం : వీధి కుక్కల భయంతో బాలుడు మృతి

హైదరాబాద్ లోని జగద్గిరిగుట్ట లో విషాదం చోటుచేసుకుంది. వీధి కుక్కల భయంతో బాలుడు మృతిచెందడం కలకలం రేపుతోంది. నగరంలో రోజు రోజుకు వీధి కుక్కల దాడులు ఎక్కువైపోతున్నాయి. ఇప్పటికే పలువురు చిన్నారులు కుక్కల దాడిలో మృతి చెందగా, పదుల సంఖ్యలో పెద్దవారు , చిన్నవారు గాయపడ్డారు. తాజాగా మరో విషాదం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..

జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన కైసే ధుర్యోదన్, కైసే అనిషా భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉంది. వీరి పెద్ద కుమారుడు కైసే మనోజ్ (11) నాలుగో తరగతి చదువుతున్నాడు. మధ్యహ్నం ఒంటి గంట ప్రాంతంలో మనోజ్ మరియు ఇతని ఫ్రెండ్స్ లెనిన్ నగర్ లో ఆడుకుంటుండగా ఒక్కసారిగా వీధి కుక్కలు వీరిని తరిమాయి.

విధి కుక్కలు ఎక్కడ తమపై దాడి చేస్తాయోయోననే భయంతో పిల్లలు అందరూ భయంతో పరుగులు పెట్టారు. ఈ క్రమంలో బాలుడు మనోజ్ స్థానికంగా ఉన్న క్వారీ గుంతలో ప్రమాదవశాత్తు పడి చనిపోయాడు. వీధి కుక్కలు తరిమినందుకే ప్రాణాల కోసం పరిగెత్తిన తన కొడుకు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.