నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ లోని ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్‌ 8వ పాలకమండలి సమావేశానికి ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రం సాధించిన ప్రగతి- అమలు చేస్తున్న కార్యక్రమాలపై సమావేశంలో నివేదిక సమర్పించారు. ఆరోగ్యకరమైన పెట్టుబడుల ద్వారా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ద్వారా ఆర్థికవ్యవస్థ వేగంగా పురోగమిస్తుంది. భారతదేశంలో లాజిస్ట్రిక్స్‌ ఖర్చు చాలా ఎక్కువగా ఉంది. లాజిస్టిక్స్‌ కోసం పెడుతున్న ఖర్చు జీడీపీలో 14 శాతంగా ఉంది. భారతీయ ఉత్పత్తులు ప్రపంచస్థాయిలో పోటీపడేందుకు ఇది ప్రతిబంధకంగా మారింది. అమెరికాలో చూసుకుంటే లాజిస్టిక్స్‌ ఖర్చు కేవలం 7.5శాతానికే పరిమితం అయ్యింది. గడచిన తొమ్మిదేళ్లలో సరకు రవాణా కారిడార్లు, జాతీయ రహదారులపై ప్రభుత్వం ప్రశంసనీయరీతిలో వ్యవయం చేస్తోంది. మనం ఆశించిన ఫలితాలను సాధించడానికి దీన్ని కొనసాగించడం చాలా అవసరం అని జగన్ అన్నారు.

ఏపీ ప్రభుత్వం పోర్టు ఆధారిత అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 4 కొత్త పోర్టులు, 10 ఫిషింగ్‌ హార్బర్లు ఏర్పాటు అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కర్నూలులోని ఓర్వకల్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసింది. విశాఖపట్నంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా PPP పద్ధతిలో నిర్మిస్తోంది. దేశ GDPలో తయారీ, సేవల రంగం వాటా 85% దాటినప్పుడే ‘వికసిత్ భారత్’ లక్ష్యం నెరవేరుతుంది. రెండు రంగాల ప్రపంచ సగటు వాటా 91.5%. ఈ లక్ష్యాన్ని సాధించడానికి వ్యవసాయం, పెట్టుబడులు రెండింటికి సంబంధించిన అంశాలపై అత్యంత దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. ఆహార రంగంలో స్వయం సమృద్ధిని సాధించడంతోపాటు, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం చాలా అవసరం అని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.

విశాఖపట్నంలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌ ద్వారా రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, తద్వారా 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు . అలాగే, రాష్ట్రంలో ప్రజారోగ్యం, పౌష్టికాహారంపై దృష్టి పెట్టామన్నారు. వైద్య రంగంలో కీలకమైన సంస్కరణలు తెచ్చామని సీఎం జగన్ వివరించారు. ఏపీలో విలేజ్‌ క్లినిక్‌, ఫ్యామిలీ డాక్టర్‌ విధానాల్ని అనుసరిస్తున్నట్టు వివరించారు.

ప్రజారోగ్యం, పౌష్టికాహారం కూడా చాలా ముఖ్యమని తాను గట్టిగా చెప్పగలనని సీఎం జగన్ అన్నారు. పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, పెరుగుతున్న NCD (సంక్రమించని దీర్ఘకాలిక వ్యాధుల)ల భారం గురించి మనం తెలుసుకోవాలన్నారు. హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం వంటి అనారోగ్యాలకు సమయానికి చికిత్స అందించకపోతే తీవ్ర సమస్యలకు దారితీస్తోందన్నారు. టెరిషరీ హెల్త్‌కేర్‌ పేరిట అతిపెద్ద భారానికి దారితీస్తుందని తెలిపారు. అందుకే దీనిపై ఎక్కువగా శ్రద్ధపెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే, హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌ పౌష్టికాహారంపై అత్యంత శ్రద్ధపెట్టాలన్నారు.