ధరలపై టీడీపీ వాయిదా తీర్మానం.. తిరస్కరణ

టీడీపీ ఎమ్మెల్యేల నినాదాలతో రెండో రోజు ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. మంగళవారం సభ మొదలవగానే నిత్యావసర వస్తువుల ధరలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. అయితే వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని టీడీపీ సభ్యులు ఒత్తిడి తీసుకొచ్చారు. ఇదే సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఇదే సభలో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

టీడీపీ సభ్యుల నినాదాలు మధ్యే మంత్రులు బిల్లులను ప్రవేశపెడుతున్నారు. స్పీకర్ పోడియం ఎక్కి మరీ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్ చైర్ వద్దకు దూసుకొచ్చిన ఎమ్మెల్యేలు బాదుడే బాదుడు అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో అసెంబ్లీలో ఎవరేమి మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పప్పులు, ఉప్పులు బాదుడే బాదుడు అంటూ ప్రతిపక్ష టీడీపీ సభ్యుల నినాదాలతో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.