ఈ నెల 19 న బిజెపి కండువా కప్పుకోబోతున్నట్లు తెలిపిన బూర నర్సయ్య గౌడ్

టిఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసిన భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్..ఈ నెల 19న బీజేపీలో చేరబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. బీజేపీలో చేరడం ఘర్ వాపసీ లాంటిదని.. పదవుల కోసం పార్టీ మారడం లేదని తెలిపారు. టీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ను కలవడం ఒక ఉద్యమంలా మారిందని విమర్శించారు. పార్టీలతో సంబంధం లేకుండా కేంద్రం అభివృద్ధికి సహకరిస్తోందన్నారు. బీజేపీ సిద్ధాంతమైన సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనేది తన జీవిత ఫిలాసఫీ అన్నారు.

బూర నర్సయ్య రాజకీయ జీవితం విషయానికి వస్తే..తెలంగాణ ఉద్యమంలో బూర నర్సయ్య గౌడ్ క్రియాశీలక పాత్ర పోషించాడు. ఆయన టీఆర్‌ఎస్‌లో 2013 జూన్‌ 2న చేరి, 2014 లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరపున భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి 30,300 ఓట్ల తేడాతో గెలుపొందాడు. స్టాండింగ్‌ కమిటీ ఆన్‌ లేబర్, పార్లమెంటరీ కమిటీ ఆన్‌ వెల్ఫేర్‌ ఆఫ్‌ ఓబీసీస్, కన్సల్టేటì వ్‌ కమిటీ ఆన్‌ మినిస్ట్రీ ఆఫ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ సభ్యుడిగా ఉన్నాడు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓటమిపాలయ్యాడు.

ప్రస్తుతం హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ లాప్రోస్కోపిక్ సర్జరీ (HILLS) కి డైరెక్టర్ గా ఉన్నాడు. అందేకాకుండా ఆదిత్య హాస్పిటల్, కేర్ హాస్పిటల్ లలో వైద్య సేవలు అందిస్తున్నాడు. బూర లక్ష్మయ్య, రాజమ్మ ఫౌండేషన్ ను స్థాపించి వ్యవస్థాపక చైర్మెన్ గా ఉంటూ పిల్లలు లేని జంటలకు ఉచిత లాప్రోస్కోపిక్ సేవలు అందిస్తున్నాడు. తెలంగాణలోని గ్రామ ప్రాంతాలలో లాప్రోస్కోపిక్ సర్జరీపై అవగాహన కల్పిస్తున్నాడు.