మునుగోడులో ఈ నెల 21న బిజెపి భారీ బహిరంగ సభ

bjp-will-hold-a-huge-public-meeting-on-21st-of-this-month-in-munugodu

మునుగోడుః మునుగోడు ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా… కమలనాథులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు నియోజకవర్గంలో పర్యటిస్తూ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 21న మునుగోడులో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అమిత్‌షా వస్తుండటంతో.. సభకు పెద్దఎత్తున జనాన్ని తీసుకొచ్చేందుకు నేతలు శ్రమిస్తున్నారు. ఇప్పటికే జన సమీకరణ, ఇతర ఏర్పాట్ల కోసం పార్టీ రాష్ట్ర నాయకత్వం.. మండలానికి ఇద్దరు చొప్పున ఇంఛార్జ్‌లను నియమించింది. ఈ నేతలు శ్రేణులను సమన్వయం చేసుకుంటూ.. బహిరంగ సభకు భారీ ఎత్తున తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. గతంలో జరిగిన సభలకు పెద్ద ఎత్తున బిజెపి కార్యకర్తలు తరలివచ్చారని.. అలాగే మునుగోడు సభ విజయవంతం అవుతోందని.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.

మునుగోడు బహిరంగ సభలో పార్టీ చేరికలపై రాష్ట్ర అధిష్ఠానం ప్రధానంగా దృష్టి సారించింది. అమిత్‌ షా సమక్షంలో.. కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాషాయతీర్థం పుచ్చుకోనున్నారు. ఆయనతో పాటు నియోజకవర్గంలోని పలువురు కీలక నేతలు భాజపాలో చేరనున్నారు. ఇప్పటికే చౌటుప్పల్‌ ఎంపీపీ వెంకట్‌రెడ్డి టిఆర్‌ఎస్‌ నుంచి బిజెపిలో చేరారు. కాంగ్రెస్‌కి చెందిన సీనియర్‌ నేతలతో పాటు.. టిఆర్‌ఎస్‌ అసంతృప్త నేతలను పార్టీలోకి ఆహ్వానించేందుకు.. బిజెపి చేరికల కమిటీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. మరోవైపు మునుగోడు ఉపఎన్నిక గెలుపుతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు వస్తాయని.. బిజెపికు ఈ ఉప ఎన్నిక విజయం ఊపును తీసుకొస్తుందని.. రాజగోపాల్‌రెడ్డి అన్నారు. బండి సంజయ్‌ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర హన్మకొండ జిల్లాలో ఈ నెల 26న ముగియనుండగా.. అక్కడ భారీ బహిరంగ సభకు బిజెపి ఏర్పాట్లు చేస్తోంది. ఇవాళ నెల్లుట్ల, జనగామ పట్టణంలో 15 కిలోమీటర్లు బండి పాదయాత్ర కొనసాగనుంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/