నేను ఏ తప్పూ చేయలేదు..కేవలం నన్ను అడ్డుకోడానికి బిజెపి చేస్తున్న కుట్రః కేజ్రీవాల్‌

BJP wants me arrested so I can’t campaign for polls.. Kejriwal on ED summons

న్యూఢిల్లీః ఆప్‌ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తాజాగా ఇచ్చిన సమన్లపై స్పందించారు. ఈడీ ఇచ్చిన నోటీసులు లీగల్‌గా చెల్లవని తేల్చి చెప్పారు. ఈ మేరకు బిజెపి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రచారం చేయకుండా తనను అడ్డుకోవడానికి బిజెపి కుట్ర చేస్తోందని ఆరోపించారు. తాను ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఈడీ పంపిన సమన్లను ఆయన తీవ్రంగా ఖండించారు.

‘నేను ఏ తప్పూ చేయలేదు. కేవలం నన్ను అడ్డుకోడానికి బిజెపి చేస్తున్న కుట్ర ఇది. మద్యం పాలసీలో అవినీతి జరగలేదన్నది నిజం. కానీ బిజెపి మాత్రం ఏదో జరిగిపోయిందని చెప్పి నన్ను అరెస్ట్ చేయాలని చూస్తోంది. నా నిజాయితీయే నాకున్న ఆస్తి. దాన్ని వారు దెబ్బతీయాలని చూస్తున్నారు. ఈడీ పంపిన సమన్లు చెల్లవని ఇప్పటికే మా లాయర్లు చెప్పారు. బిజెపి లక్ష్యం నన్ను విచారించడం కాదు.. లోక్‌సభ ఎన్నికల ముందు ప్రచారం చేయకుండా కట్టడి చేసేందుకే ఇదంతా. విచారణ సాకుతో నన్ను పిలిచి అరెస్ట్‌ చేయాలనుకుంటున్నారు’ అని కేజ్రీవాల్‌ ఆరోపించారు.