తెలంగాణ బిజెపి నేతలకు దిశా నిర్దేశం చేసిన జేపీ నడ్డా

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రజా సంగ్రామ యాత్ర లో భాగంగా మహబూబ్ నగర్ లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలకు నడ్డా పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో పోస్ట్ మాన్ తరహాలో నాయకులు పని చేస్తే సరిపోదని, పార్టీని గ్రామ స్థాయి నుంచి పటిష్టంగా బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా దిశా నిర్దేశం చేశారు. పార్టీ బలోపేతం కోసం కష్టపడకపోతే ఎలాంటి ఫలితం ఉండదన్నారు. వారంలో ఒకరోజు ఏదైనా ఒక నియోజకవర్గంలో పర్యటించాలన్నారు. పది పాయింట్స్ ఫార్ములా పెట్టుకుని అందరూ కష్టపడి పార్టీ కోసం పని చేయాలని ఆదేశించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీకి మంచి అవకాశం ఉందని, ఇందుకోసం గొప్ప గొప్ప కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు అందరూ కలిసి కృషి చేయాలని కోరారు. రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన కార్యక్రమాలను అందరూ కలిసికట్టుగా అమలు చేయాలన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామితో పాటు రాష్ట్ర బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీన మహేశ్వరంలో బండి సంజయ్ రెండో విడత పాదయాత్ర ముగింపు సభ ఉంటుంది. దీనికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానుండటంతో భారీగా జన సమీకరణ చేయాలని, పార్టీ పటిష్టత కోసం అందరూ కష్టపడాలని నేతలకు జేపీ నడ్డా సూచించారు.