ఉచిత హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను నియంత్రించలేంఃసుప్రీంకోర్టు

న్యూఢిల్లీః ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీల పై డీఎంకే దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్ధానం కీలక వ్యాఖ్యలు చేసింది. హామీలను గుప్పించకుండా రాజకీయ పార్టీలను నియంత్రించలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమ ప్రభుత్వాల భాధ్యతని, ప్రజా ధనాన్ని సరైన పద్ధతిలో వెచ్చించడమే ఇక్కడ ప్రధాన అంశమని సీజేఐ నొక్కిచెప్పారు.
ఈ వ్యవహారం చాలా సంక్లిష్టమైనదని, అసలు ఈ అంశాలను న్యాయస్ధానం పరిశీలించవచ్చా అనే ప్రశ్న కూడా తలెత్తుతుందని అన్నారు. ఎన్నికల్లో ఉచిత హామీల అంశంపై డీఎంకే మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పధకాలను ఎన్నికల తాయిలాలుగా పేర్కొనరాదని డీఎంకే వాదిస్తోంది.
విస్తృత, బహుళ ఉద్దేశాలతో సంక్షేమ పధకాలు అమలవుతాయని పేర్కొంది. కోర్టు సూచనలను పరిగణనలోకి తీసుకుని కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషనర్ హన్సరియా కోరారు. ఇక తాము ఈ అంశంలో జోక్యం చేసుకుంటూ పిటిషన్ వేశామని, భారత్ సంక్షేమ రాజ్యమని, సంక్షేమ పధకాలు అవసరమని కమిటీ ఏర్పాటును తాము వ్యతిరేకిస్తున్నామని డీఎంకే తరపు న్యాయవాది పీ విల్సన్ కోర్టుకు నివేదించారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/international-news/