నేడు 50 మందితో నేడు బిజెపి తొలి జాబితా విడుదల

తొలి జాబితాలో 20 మందికిపైగా బీసీలకు చాన్స్

bjp-to-release-first-list-today-with-50-candidates

హైదరాబాద్‌ః తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తొలి జాబితాను బిజెపి నేడు ప్రకటించనుంది. మొత్తం 50 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేయనున్నట్టు ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ ప్రకటించారు. అంతేకాదు, ఈ 50 మందిలో 20కిపైగా స్థానాల్లో బీసీలను బరిలోకి దింపుతున్నట్టు తెలిపారు. అభ్యర్థుల ఎంపికలో బిజెపి సామాజిక న్యాయం పాటిస్తుందని చెప్పడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. సీట్ల కేటాయింపులో మహిళలు, బీసీలకు పెద్ద పీట వేసినట్టు పేర్కొన్నారు. ఇక, పార్టీ నుంచి సస్పెండ్ అయిన రాజాసింగ్ వ్యవహారాన్ని అధిష్ఠానం పరిశీలిస్తోందని లక్ష్మణ్ తెలిపారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై విమర్శలు సంధించారు. మహిళలకు సీట్ల విషయంలో బిఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తోందని దుయ్యబట్టారు. మహిళల కోసమంటూ కవిత ఢిల్లీలో ధర్నాలు చేశారని, కానీ ఆ పార్టీ మాత్రం మహిళలకు సీట్లు ఇవ్వలేదని ఆరోపించారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మహిళలను పక్కనపెట్టేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీలను వాడుకుని వదిలేసిందని ఆరోపించారు.