సీట్లు కాదు గెలుపు ముఖ్యం – చంద్రబాబు

ఏపీలో త్వరలో జరగబోయే అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికల్లో టిడిపి – జనసేన – బిజెపి కలిసి పోటీ చేయబోతున్నాయి. వైసీపీ పార్టీ ని ఎదుర్కోవాలంటే సింగిల్ గా వెళ్తే సరిపోదని ఉమ్మడిగా వెళ్తేనే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఇప్పటికే టిడిపి – జనసేన పార్టీలు తమ స్థానాలను ప్రకటించగా..నిన్న ఉండవల్లి లోని చంద్రబాబు నివాసంలో బిజెపి అగ్ర నేతలతో సమావేశం జరిపి సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఓ నిర్ణయం తీసుకున్నారు.

పొత్తుల్లో భాగంగా బీజేపీ-జనసేనకు అదనంగా మరో అసెంబ్లీ స్థానం కేటాయించారు. మొత్తం 31 అసెంబ్లీ, 8 ఎంపీ స్థానాల్లో బీజేపీ-జనసేన పోటీ చేయనున్నాయి. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి 8 ఎంపీ సీట్లు కేటాయించగా ఇందులో 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది. అదే విధంగా 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది. ముందుగా 30 అసెంబ్లీ, 8 ఎంపీ స్థానాలకు ఒప్పందం కుదిరగా, తమ కోటాలో నుంచి బీజేపీకి 3 అసెంబ్లీ స్థానాలు జనసేన ఇచ్చింది. అదే విధంగా తమ కోటా నుంచి అదనంగా ఒక అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి టీడీపీ ఇచ్చింది. ఈ మేరకు సీట్ల సర్దుబాటు పూర్తైనట్లు చంద్రబాబు, పవన్ కల్యాణ్​లు ట్వీట్ చేశారు.

కూటమి మధ్య సీట్ల పంపకాలు పూర్తయ్యాయని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ట్వీట్‌ చేశారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిని ఆశీర్వదించాలని కోరారు. ఈ మహత్తరమైన ముందడుగుతో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకునే దశకు చేరుకున్నారని అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ సైతం ట్వీట్ చేసారు.

రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనే సీట్ల పంపకం జరిగిందని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. సీట్ల సంఖ్య, హెచ్చుతగ్గుల కంటే రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యమని తెలిపారు. అదే ఉద్దేశంతో మూడు పార్టీలు ధృడ సంకల్పంతో ముందడుగు వేశాయని వెల్లడించారు. కూటమి ఆవిర్భావంతో రాష్ట్ర పురోభివృద్ధికి బలమైన పునాదిపడిందన్న పవన్‌, ఏపీ అభివృద్ధి, ప్రగతి, ప్రజల స్థితిగతుల మెరుగుదలకు మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయన్నారు.