ఢిల్లీకి బయల్దేరిన పార్టీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్

అధిష్ఠానం పిలుపుతో ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న రఘునందన్ రావు

bandi-sanjay-and-raghunandan-rao-meet-bjp-high-command-may-be-for-central-cabinet-expansion

హైదరాబాద్‌ః నేడు ప్రధాని అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరగనున్న నేపథ్యంలో బిజెపి రాష్ట్ర నేతలు ఢిల్లీకి చేరుకుంటున్నారు. అధిష్ఠానం పిలుపుతో ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న రఘునందన్ రావు.. పలువురు కీలక నేతలను కలుసుకుంటున్నారు. రఘునందన్ రావు శాసనసభాపక్ష నేత పదవిని ఆశిస్తున్నారని, ఇందులో భాగంగానే పలువురు అగ్ర నేతలను, కేంద్ర మంత్రులను కలుస్తున్నారని సమాచారం. అయితే, కీలక సమావేశం ముందు రాష్ట్ర నేతలను ఢిల్లీకి పిలిపించుకోవడంపై బిజెపి వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కొన్ని రోజులుగా బిజెపి తెలంగాణ అధ్యక్షుడిని మార్చేస్తారంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై పార్టీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ తో పాటు పలువురు అగ్రనేతలు ఇప్పటికే స్పష్టత నిచ్చారు. బండి సంజయ్ ను మార్చబోమని చెప్పారు. అయితే, తాజా పరిణామాలతో మరోమారు ఈ ప్రచారం ఊపందుకుంది.

తాజాగా ప్రధాని మోడీ అధ్యక్షతన సోమవారం సాయంత్రం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరగనుంది. ఈ సమయంలోనే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి ఢిల్లీకి వెళ్లడంపై పార్టీలో ఉత్కంఠ నెలకొంది. బండి కంటే ముందే రఘునందన్ రావు కూడా ఢిల్లీకి వెళ్లారు. ఇద్దరు నేతలు ఒకరి తర్వాత ఒకరు హస్తినకు వెళ్లడంతో రాష్ట్ర నాయకత్వంలో మార్పులు చోటుచేసుకుంటాయని ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరు నేతల మధ్య విభేదాలు పొడసూపాయని, కొన్ని రోజులుగా వారు కలుసుకోలేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.