వివేకా హత్య కేసు..వివేకా పీఏ న్యాయవాదిపై సుప్రీంకోర్టు ఆగ్రహం

విచారణ బుధవారానికి వాయిదా

'Supreme' notices to CSs of AP and Bihar states
supreme-court

న్యూఢిల్లీః మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను బాధితునిగా గుర్తించాలంటూ వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ రోజు విచారణ సందర్భంగా కృష్ణారెడ్డి తరపు న్యాయవాదిపై జస్టిస్ కృష్ణ మురారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గొంతు పెంచి వాదించినంత మాత్రాన ప్రయోజనం ఉండదంటూ సీరియస్ అయ్యారు.

ఎంవీ కృష్ణారెడ్డి వేసిన ఈ కేసును తొలుత హైకోర్టుకే పంపుతామని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఈ విషయంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉందని, ముందు అక్కడ తేల్చుకోవాలని సూచించింది. అయితే ఈ కేసును ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేసే సమయంలో వివేకా భార్య, కుమార్తెలను బాధితులుగా గుర్తించిన విషయాన్ని కోర్టు దృష్టికి సునీతారెడ్డి తరపు న్యాయవాది సిద్దార్థ లూథ్రా తీసుకొచ్చారు.

ఈ కేసులో ఎంవీ కృష్ణారెడ్డిని కూడా అనుమానితుడిగా పేర్కొంటూ సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిన విషయాన్ని కూడా ధర్మాసనం దృష్టికి సిద్ధార్థ లూథ్రా తీసుకొచ్చారు. సీబీఐ చార్జిషీట్ కాపీని సమర్పించడానికి బుధవారం దాకా గడువు కోరారు. దీంతో కేసు విచారణను బుధవారానికి ధర్మాసనం వాయిదా వేసింది.