సీఎంలు మారినప్పుడల్లా రాజధాని మారుతుందా?

కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు

sujana chowdary
sujana chowdary

న్యూఢిల్లీ: బిజెపి ఎంపి సుజనాచౌదరి ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతు..సీఎంలు మారినప్పుడల్లా రాజధాని మారుతుందా? అని ప్రశ్నించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ‘మూడు రాజధానులపై ముందుకెళ్తే కేంద్ర ప్రభుత్వం చూస్తే ఊరుకోదు. ప్రజలు కూడా చూస్తూ ఊరుకోబోరు. ఇప్పటికైనా ఇటువంటి ఆలోచనలను విరమించుకోవాలి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను అభివృద్ధి చేయాలి’ అని చెప్పారు. ‘మహిళలు, రైతులపై పోలీసుల చర్యలపై మానవహక్కుల సంఘాల నేతలు రంగంలోకి దిగుతారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. హైకోర్టు, సచివాలయం, రాజ్‌భవన్‌ వంటివి ఒకే చోట ఉండాలని విభజన చట్టం సెక్షన్ 5లో చెప్పారు. 151 సీట్లు ఉన్నాయి.. .సుపరిపాలనపై దృష్టి పెట్టి పనులు చేయాలి. రాజధానిపై ప్రజా ఉద్యమమే కాకుండా న్యాయపరంగానూ పోరాడతాం’ అని తెలిపారు.

‘ఎయిమ్స్, నిఫ్ట్ వంటి అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏపీకి వచ్చాయి. ఇక్కడ ఏమేం జరుగుతుందో కేంద్ర గమనిస్తోంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వ తమ తీరు మార్చుకోకుండా ముందుకు వెళ్తే ఏం చేయాలో అది చేస్తాం. ఇష్టం వచ్చినట్లు ఏపీ ప్రభుత్వం ముందుకెళ్లడానికి వీల్లేదు. ప్రజలు కూడా చూస్తూ ఊరుకోరు. వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వ చర్యల పట్ల సంతోషంగా ఉండడం లేదు. వారు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది’ అని సుజనాచౌదరి చెప్పారు. ‘రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు జోక్యం చేసుకోవాలో అప్పుడు జోక్యం చేసుకుంటుంది. అధికారిక ప్రకటన వచ్చాక చూద్దాం. రాజధాని సమస్య కేవలం అమరావతికి చెందింది కాదు.. మొత్తం రాష్ట్రానికి చెందింది. రాజధాని విషయంలో వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే భవిష్యత్తులో తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఏర్పడుతాయి’ అని చెప్పారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/