BJP ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై నుంచి వస్తున్న ఆయనను హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెదక్ అల్లర్ల దృష్ట్యా రాజాసింగ్ అరెస్ట్ చేశారు. బక్రీద్ సందర్భంగా ఆవులను తరలిస్తున్న వాహనాలను మెదక్ పట్టణంలో అడ్డుకున్నారు. దీంతో పట్టణంలో అల్లర్లు చెలరేగాయి. ఇందులో ఓ వర్గానికి చెందిన వారు బీజేవైఎం, హిందూ సంఘాల నేతలపై కత్తితో దాడి చేశారు. ఓ యువకుడు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో ఆగ్రహించిన నేతలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు రంగంలోకి దిగి అల్లర్లను సద్దుమణిగేలా చేశారు.

ఇదే క్రమంలో మెదక్‌లో ఘర్షణల నేపథ్యంలో తాను అక్కడికి వెళ్తానని రాజాసింగ్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ముంబైలో ఉన్న ఆయన ఇవాళ హైదరాబాద్‌కు వచ్చారు. రాజాసింగ్‌ కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న పోలీసులు.. ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రాగానే అదుపులోకి తీసుకున్నారు. మెదక్‌లో అల్లర్లు జరిగిన నేపథ్యంలో.. పరిస్థితి అదుపుతప్పకుండా ఉండేందుకు రాజాసింగ్‌ను ముందస్తుగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, వైద్యపరీక్ష నిమిత్తం మియాపూర్‌లో ఆస్పత్రికి తరలించారు పోలీసులు.