పుణే బిజెపి ఎంపీ గిరీశ్ బాపట్ కన్నుమూత

విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోడీ

BJP MP Girish Bapat Dies, PM Modi Offers Condolences

పుణే: పుణే ఎంపీ, బిజెపి నేత గిరీశ్ బాపట్ కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. గిరీశ్ బాపట్ ఏడాదిన్నర కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. కాగా, తమ పార్టీ ఎంపీ గిరీశ్ బాపట్ మృతి చెందడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. గిరీశ్ బాపట్ సమాజం పట్ల ఎంతో నిబద్ధత ఉన్న వ్యక్తి అని, నిరాడంబరమైన వ్యక్తి అని కీర్తించారు. కష్టపడి పనిచేసే స్వభావం ఉన్న నేత అని కొనియాడారు. మహారాష్ట్ర అభివృద్ధి ఆయనకు ప్రాధాన్యతా అంశం అని, పుణే ఉన్నతస్థాయిలో ఉండాలని ఎంతో కృషి చేశారని వివరించారు.

మహారాష్ట్రలో బిజెపిని బలోపేతం చేసేందుకు నిర్మాణాత్మక సేవలు అందించారని, అటువంటి నేత అందరినీ విడిచి వెళ్లిపోవడం బాధాకరమని మోడీ అభిప్రాయపడ్డారు. గిరీశ్ బాపట్ కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు వెల్లడించారు. గిరీశ్ బాపట్ గతంలో మహారాష్ట్ర మంత్రిగా పనిచేశారు. కస్బాపేట్ నియోజవర్గం నుంచి 5 పర్యాయాలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో లోక్ సభకు పోటీ చేసి పుణే నుంచి గెలుపొందారు. కాగా, గిరీశ్ బాపట్ అంత్యక్రియలు ఈ సాయంత్రం నిర్వహించనున్నారు.