శ్రీ చైతన్య విద్యాసంస్థల అధిపతి డా. బి.ఎస్‌. రావు కన్నుమూత

శ్రీ చైతన్య విద్యాసంస్థల ఫౌండర్, ఛైర్మన్ డాక్టర్ బొప్పన సత్యనారాయణ రావు (75) కన్నుమూశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో జారిపడడంతో ఆయన మృతి చెందారు. కాసేపట్లో బీఎస్ రావు భౌతికకాయాన్ని విజయవాడకు తరలించనున్నారు. రేపు (జూలై 14) విజయవాడలో బీఎస్ రావు అంత్యక్రియలు జరగనున్నాయి.

డాక్టర్ బొప్పన సత్యనారాయణరావు (బి.యస్.రావు) శ్రీ చైతన్య జూనియర్ కాలేజీని కేవలం 56మంది విద్యార్థులతో విజయవాడలో 1986లో ప్రారంభించారు. తొమ్మిదేళ్ల వరకు ఈ విద్యాసంస్థ ఎలాంటి విస్తరణకు నోచుకోలేదు. విద్యార్థులు మాత్రం వెయ్యిమందికి పెరిగారు. 1995 నుంచే ఈ విద్యాసంస్థ విస్తరించటం ఆరంభమైంది. ఒకేఒక బ్రాంచ్‌తో ఆరంభమైన ఈ విద్యావ్యవస్థ నేడు 300 లకు పైగా బ్రాంచ్‌లతో దేశవ్యాప్తంగా విస్తరించింది.

ఇంటర్ నుంచి విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేయటం అనేది శ్రీ చైతన్య విద్యాసంస్థల తన ప్రత్యేకతగా నిలుపుకుంది. పదవ తరగతిలో మంచి మార్కులు స్కోర్ చేసిన విద్యార్థులను గుర్తించి.. వారికి ఇంటర్ నుంచి చక్కటి పునాది వేసేందుకు సమాయత్తమయ్యేటట్లు ఈ విద్యావ్యవస్థను ఆయన తీర్చిదిద్దారు. పదవ తరగతి నుంచి ఇంటర్‌కు వెళ్లటం అనేది విద్యార్థి దశలో కీలక మలుపు. అందుకే ఈ మలుపునే ఆయన వ్యాపార విస్తరణకు అవకాశంగా మలుచుకున్నారు. ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, కర్నాటకలలో దీని బ్రాంచ్‌లు ఏర్పడ్డాయి. 2006 నుంచి ఐఐటి-జెఇఇ, ఎఐఇఇఇ, పిఎంటి కోచింగ్ సెంటర్లు హిమాచల్‌ప్రదేశ్, చండీగఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఏర్పాటుచేశారు.