రాజస్థాన్ ముఖ్యమంత్రి పీఠంపై ఉత్కంఠ..నేడు సీఎంను ఎంపిక చేయనున్న బిజెపి

BJP May Announce Rajasthan Chief Minister Today

న్యూఢిల్లీః ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రుల విషయంలో బిజెపి అనూహ్య నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ రెండు రాష్ట్రాల్లోనూ ఎవరూ ఊహించని విధంగా కొత్తవారిని సీఎంలుగా నియమించింది. అయితే, ఇప్పుడు అందరి దృష్టి రాజస్థాన్‌ సీఎం పీఠంపైనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడై వారం రోజులు గడుస్తున్నా ఇంకా సీఎం ఎవరన్నదానిపై ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ఈ ఉత్కంఠకు నేడు తెరపడే అవకాశం ఉంది.

బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే భజన్‌లాల్ శర్మ, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇద్దరు సహ పరిశీలకులు, జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే, జాతీయ ఉపాధ్యక్షురాలు సరోజ్ పాండే సమక్షంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు పాల్గొని శాసనసభా పక్ష నేతను ఎన్నుకోనున్నారు. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలందరూ హాజరు కావాలని బిజెపి ఆదేశించింది.

రాష్ట్రంలో బిజెపి పార్టీ విజయం తర్వాత బాబా బాలక్ నాథ్ పేరు ప్రచారంలోకి వచ్చింది. ఎంపీ పదవికి రాజీనామా చేసిన రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, దియా కుమారి కూడా సీఎం రేసులో ఉన్నారు. అయితే అందరి దృష్టి మాత్రం రాజస్థాన్‌ మాజీ సీఎం వసుంధర రాజే పైనే ఉంది. కాగా, వసుంధర రాజే సైతం సీఎం పగ్గాల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. గత వారం ఢిల్లీ వెళ్లిన ఆమె బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. అయితే కొత్త వారిని సీఎం చేయాలన్న యోచనలో బిజెపి అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.