నేడు 65 మంది అభ్యర్థులతో బిజెపి తొలి జాబితా విడుదల

నేటి సాయంత్రం తొలి జాబితా ప్రకటన

BJP likely to release first list of 65 candidates today

హైదరాబాద్‌ః తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అధికార బిఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ నేతలు సభలు, సమావేశాలతో ప్రజల్లోకి వెళ్లి బిజీబిజీగా ఉంటే బిజెపి మాత్రం ఇప్పటికీ అభ్యర్థుల జాబితా తయారీలోనే తలమునకలై ఉంది. అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చిందని, నేడు 65 మందితో తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్టీ ఎన్నికల ఇన్‌చార్జ్ ప్రకాశ్ జవదేకర్ నివాసంలో నిన్న జరిగిన రాష్ట్ర కోర్‌కమిటీ సభ్యులు పలుమార్లు చర్చించి జాబితాను సిద్ధం చేశారు.

ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌లు తరుణ్‌ఛుగ్, సునీల్ బన్సల్‌తోపాటు తెలంగాణ బిజెపి చీఫ్ కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్, డీకే అరుణ, బండి సంజయ్, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. బిజెపి చీఫ్ నడ్డా నివాసంలో గతరాత్రి జరిగిన సమావేశానికి అమిత్ షా కూడా హాజరయ్యారు. ఈ ఉదయం 11 గంటలకు నడ్డాతో మరోమారు సమావేశమైన తర్వాత తుది జాబితాను సిద్ధం చేసి సాయంత్రం జరిగే బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశానికి పంపిస్తారు. ప్రధాని మోడీ, నడ్డా, అమిత్ షా పాల్గొనే ఆ సమావేశంలో తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటిస్తారు.