కేసీఆర్ బస్సు యాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర చేసినా ప్ర‌జ‌లు న‌మ్మ‌రుః ల‌క్ష్మ‌ణ్

bjp-leader-laxman-comments-kcr-bus-yatra?

హైదరాబాద్‌ః బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ ఏప్రిల్ 22వ తేదీ నుంచి చేప‌ట్ట‌నున్న బ‌స్సు యాత్ర‌పై బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు ల‌క్ష్మ‌ణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ బస్సు యాత్ర కాదు క‌దా మోకాళ్ల యాత్ర చేసినా ఆయ‌న‌ను ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌న్నారు. శ‌నివారం బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో మాట్లాడిన ల‌క్ష్మ‌ణ్‌.. అటు సీఎం రేవంత్ రెడ్డిపై కూడా విమ‌ర్శ‌లు గుప్పించారు. సొంత ఎమ్మెల్యేల ప‌ట్ల ముఖ్య‌మంత్రికి అభ‌ద్ర‌తా భావం ఎందుక‌ని ప్ర‌శ్నించారు. వంద రోజుల త‌మ ప‌రిపాల‌న‌ను రెఫ‌రెండంగా చేసుకుని 14 ఎంపీ స్థానాలు గెలుస్తామ‌న్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు మొస‌లి క‌న్నీరు కారుస్తున్నార‌ని చుర‌క‌లంటించారు.

తెలంగాణ‌లో బీజేపీ 12 స్థానాల్లో గెల‌వ‌డం ఖాయ‌మ‌ని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీకి, ప్ర‌ధాని మోదీకి రోజురోజుకు ఆద‌ర‌ణ పెరుగుతోందన్నారు. అందుకే మోదీ చ‌రిష్మాను త‌గ్గించి చూపేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చీక‌టి ఒప్పందం చేసుకున్నాయ‌ని ఆరోపించారు. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు త‌న‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని చెప్పి 24 గంట‌లు గ‌డ‌వ‌క ముందే గులాబీ పార్టీ ఎమ్మెల్యే ఒక‌రు కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అయ్యార‌ని ఈ రెండు పార్టీలు క‌లిసి గేమ్ ఆడుతున్నాయ‌ని ల‌క్ష్మ‌ణ్ ఆరోపించారు. ఇక లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో భాగంగా మొద‌టి ద‌శ‌లో శుక్ర‌వారం జ‌రిగిన ఎన్నిక‌ల‌లో బీజేపీ 50 శాతం కంటే ఎక్కువ సీట్లు గెలుస్తుంద‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు.