కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు బిజెపి , కాంగ్రెస్ లు సై..

టిఆర్ఎస్ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ముందస్తు ఎన్నికల సవాల్ కు బిజెపి , కాంగ్రెస్ పార్టీ లు సై అంటున్నారు. ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్ బిజెపి ఫై నిప్పులు చెరుగుతూ..ముందస్తు ఎన్నికలకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

దీనిపై బండి సంజయ్ మాట్లాడుతూ..కేసీఆర్ ముందస్తు ఎన్నికల సవాల్ ను స్వీకరిస్తున్నామని తెలిపారు.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీదే గెలుపని ధీమా వ్యక్తంచేశారు. టీఆర్‌ఎస్‌లో ఏక్‌నాథ్‌ షిండేలు ఉన్నారని, కేసీఆర్‌ సర్కార్‌ను పడగొట్టే అవసరం తమకు లేదన్నారు. టీఆర్‌ఎస్‌ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ముందస్తు ఎన్నికల అంశాన్ని కేసీఆర్ తెరమీదకు తీసుకొచ్చారని తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. ఆదివారం నాటి ప్రెస్‌మీట్‌లో కేసీఆర్‌ ముఖంలోని భయాన్ని ప్రజలందరూ గమనించారని ఎద్దేవా చేశారు కేసీఆర్ ఏం చేసినా ఆయన కుటుంబం బాగు పడటానికి మాత్రమేనని మండిపడ్డారు. ధరణి పోర్టల్ వల్ల ఎవరికి న్యాయం జరిగిందో సీఎం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ధరణి పోర్టల్ తీసుకొచ్చి గందరగోళం సృష్టించారని, 15 లక్షల ఎకరాలు ధరణి పోర్టర్‌లో ఇంతవరకూ ఎంట్రీ కాలేదని తెలిపారు.

అలాగే కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సైతం కేసీఆర్ ముందస్తు ఎన్నికల సవాల్ ను స్వీకరించారు. ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. కేసీఆర్‌ ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నువ్వు సవాల్ చేయడం కాదు.. ముందు అసెంబ్లీ రద్దు చేయ్‌ అంటూ సవాల్‌ విసిరారు. తక్షణమే అసెంబ్లీ రద్దు చేయాలని శాసనసభ రద్దయితే ఆటోమెటిక్‌గా ఎన్నికలు వస్తాయని, ఎన్నికలకు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని, ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందన్నారు. మొత్తం మీద కేసీఆర్ ముందస్తు మాట తో రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు ఎన్నికల ప్రస్తావన గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.