ఎమ్మెల్యేగా మేకపాటి విక్రమ్‌రెడ్డి ప్రమాణస్వీకారం

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ తో విజయం సాధించిన మేకపాటి విక్రమ్‌రెడ్డి ..ఈరోజు సోమవారం ఎమ్మెల్యే గా ప్రమాణస్వీకారం చేసారు. ప్రమాణస్వీకారం అనంతరం ఏపీ సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..తమ కుటుంబంపై ప్రేమ చూపించి భారీ మెజార్టీతో గెలిపించిన ఆత్మకూరు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తన సోదరుడు గౌతమ్‌ రెడ్డి ఆశయాలను నెరవేరుస్తానన్నారు. నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ చేస్తున్న మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళతామన్నారు.

రాష్ట్రపతి ఎన్నికలు ఉండటంతో మంచిరోజు చూసుకొని ముందుగానే ప్రమాణ స్వీకారం చేశాను అన్నారు. విక్రమ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డితో పాటూ పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మేకపాటి కుటుంబ వారసుడుగా మేకపాటి విక్రమ్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారని.. విక్రమ్‌కు ప్రజలు సంపూర్ణ సహకారం అందించారన్నారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. ఆత్మకూరు నియోజకవర్గం ప్రజలు ఎంతో ప్రేమ చూపి విక్రమ్ రెడ్డికి ఘన విజయం అందించారని.. జగన్మోహన్ రెడ్డి మంచి ఆలోచనతో మేకపాటి విక్రమ్ రెడ్డికి టికెట్ ఇచ్చారన్నారు. ఏకపక్షంగా సాగిన ఈ ఉప ఎన్నికల్లో మేకపాటి విక్రమ్‌ రెడ్డి.. 82,888 ఓట్ల భారీ మెజార్టీతో విజయ ఢంకా మోగించారు. ఉప ఎన్నికలో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి భరత్‌ కుమార్‌ డిపాజిట్‌ కోల్పోయారు. మొత్తం 20 రౌండ్లలో కౌంటింగ్ జరిగింది. రౌండ్ రౌండ్ కూ మేకపాటి విక్రమ్ రెడ్డి మెజారిటీ పెంచుకుంటూ పోయారు.