భద్రాచలం వద్ద 71 అడుగులకు చేరిన నీటిమట్టం..

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 71 అడుగులకు చేరింది. గంటకు గంటకు పెరుగుతూ వస్తుండడంతో ముంపు గ్రామాల ప్రజలతో పాటు భద్రాచలం పట్టణవాసులు సైతం ఖంగారు పడుతున్నారు. ఇప్పటికే పలు కాలనీల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రామాల‌యంతో పాటు స‌మీప కాల‌నీలు నీట మునిగాయి. కొత్త కాలనీ, ఏఎంసీ కాలనీ, అయ్యప్ప కాలనీ, శాంతినగర్‌ పిస్తా కాంప్లెంక్స్‌ ఏరియా, సుభాష్‌ నగర్‌ ప్రాంతాల్లో దాదాపు వెయ్యి మందిని 9 పునరావాస కేంద్రాలకు చేర్చారు. దాదాపు 36 ఏళ్ల క్రితం ఈ తరహా వరదలు వచ్చాయని..మళ్లీ ఇప్పుడు వచ్చాయని స్థానికులు అంటున్నారు. వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యగా అధికారులు భ్రదాచలం వంతెనను మూసివేశారు. బ్రిడ్జిపై నుంచి ఎలాంటి వాహనాలను రాకపోకలకు అనుమతించడం లేదు.

1986లో నీటిమట్టం 75.6 అడుగులకు చేరిన సమయంలో మొదటిసారిగా వంతెనపై రాకపోకలను నిలిపివేశారు. మళ్లీ 36 సంవత్సరాల భారీగా వరద వస్తుండడంతో ఆంక్షలు విధించారు. మరోపక్క సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు వరద పరిస్థితి ఫై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే సహాయక చర్యలు అందించేందుకు ఇండియన్‌ ఆర్మీ రంగంలోకి దిగింది. 78 మందితో కూడిన ఇన్‌ఫాంట్రీ దళం, 10 మంది వైద్యులు, 23 మంది ఇంజినీర్లు సహా మొత్తం 101 మందితో కూడిన బృందం భద్రాచలంకు చేరుకున్నాయి. ఇక గత మూడు రోజులుగా మంత్రి పువ్వాడ భద్రాచలం లోనే ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితులను పరివేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. చాలా కాలనీలు జలమయమయ్యాయి. బాధితుల్ని పునరావాస ప్రాంతాలకు తరలించాం. 80 అడుగుల నీటిమట్టం దాటినా భారీ నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టామని తెలిపారు.