బళ్లారిలో కాంగ్రెస్ – బిజెపి కార్యకర్తల మధ్య ఘర్షణ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ పలు చోట్ల అధికార పక్షం బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. బళ్లారిలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు గొడవ పడ్డారు. ఈ గొడవలో కాంగ్రెస్ నేత ఉమేష్ గౌడ్ తలకు గాయమైంది. ఉమేష్ గౌడ్ ఇటీవలే బీజేపీని విడిచి కాంగ్రెస్ లో చేరారు. ఆయన ఓటు వేసేందుకు వెళ్తుండగా ప్రత్యర్థులు దాడికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు.

ఇక పోలింగ్ జ‌రుగుతుండ‌గా బిజెపి పార్టీపై కాంగ్రెస్ విమ‌ర్శలు గుప్పించింది. గోవా నుంచి పెద్ద‌సంఖ్య‌లో ఓటర్ల‌ను కర్ణాటకకు బీజేపీ త‌ర‌లిస్తోంద‌ని ఆరోపించింది. రాష్ట్రంలో దొంగ ఓట్లు వేయించేందుకే బీజేపీ గోవా నుంచి ప్ర‌జ‌ల‌ను బ‌స్సుల్లో త‌ర‌లిస్తోంద‌ని కాంగ్రెస్ విమ‌ర్శించింది. గోవా నుంచి క‌ర్నాట‌కకు వ‌స్తున్న బ‌స్ వీడియోతో కాంగ్రెస్ త‌న అధికారిక ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. గోవాలో బీజేపీ స‌ర్కార్ కాదంబ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేష‌న్ బ‌స్సుల్లో ప్ర‌జ‌ల‌ను ఉత్త‌ర క‌ర్నాట‌క‌కు అర్ధ‌రాత్రి ఎందుకు పంపింద‌ని కాంగ్రెస్ నేత ప‌వ‌న్ ఖేరా ప్ర‌శ్నించారు. క‌ర్నాట‌క డీజీపీకి కాంగ్రెస్ నేత ర‌ణ్‌దీప్ సుర్జీవాలా ఈ పోస్ట్‌ను ట్యాగ్ చేస్తూ ఉత్త‌ర క‌న్న‌డ జిల్లా దండేలిలోని వుడ్జ్ జింగిల్ రిసార్ట్‌లో ఏం జ‌రుగుతోంద‌ని నిల‌దీశారు.