భారత్‌కు కష్టపడి పనిచేసే ప్రధాని మోడీ

Donald Trump

New Delhi: భారత్‌కు కష్టపడి పనిచేసే ప్రధాని ఉన్నారని, ఆయన చాలా మొండి వ్యక్తి అని అయినే మోడీ అంటూ  అమెరికా అధ్యక్షుడు  ట్రంప్ ప్రశంసించారు. తాను మరోసారి అమెరికా అధ్యక్షుడిని కావడం ఖాయమని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.  వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో తానే గెలిస్తే  మార్కెట్లు భారీగా పుంజుకుంటాయని అన్నారు. రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఇవాళ ఢిల్లీలోని యూఎస్ ఎంబసీలో భారత కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో అమెరికా అధ్యక్షుడు సమావేశమయ్యారు.

ఈ కార్యక్రమానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ, రతన్‌ టాటా, మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌, ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార మంగళం బిర్లా తదితరులు హాజరయ్యారు.

భారతీయ కంపెనీల సీఈవోలతో ట్రంప్‌ ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ,  సరైన వ్యక్తులను ఎన్నుకుంటేనే ఆర్థిక పురోభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.. చైనాను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని అంటూ, కరోనాపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడానని తెలిపారు.  కరోనా వైరస్ పై చైనా గొప్ప పోరాటం చేస్తోందని, ప్రస్తుత పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తుందని చెప్పారు.

 భారత పర్యటన విజయవంతంగా జరిగిందని ట్రంప్ అన్నారు. భారత పర్యటనకు తనకు ఎంతో ఆనందం కలిగించిందన్నారు. గొప్ప ఆతిథ్యమిచ్చిన భారత్ కు కృతజ్ణతలు చెబుతున్నానన్నారు. భారత ప్రధాని మోడీ  చాలా గొప్ప వ్యక్తి అని అన్నారు. అమెరికా నుంచి భారత్ కొనుగోళ్లు జరపడం ఆనందకరమన్నారు.

భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందానికి చర్చలు జరుగుతున్నాయి, వచ్చే ఆరేడు నెలల్లో మరిన్ని  ఒప్పందాలు  కుదురుతాయని పేర్కొన్నారు. భారత్‌తో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం అమలు కృషి చేస్తానన్నారు. 

అమెరికాలో తమ రిపబ్లికన్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రావడంతో సంస్కరణలు చేసేందుకు అవకాశం వచ్చిందన్నారు. ఒబామా కేర్‌ను మించిన ఆరోగ్య సంరక్షణ పథకాన్ని తీసుకొచ్చినట్లు ట్రంప్ తెలిపారు.

అంతకుముందు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో మోడీ-ట్రంప్ సమక్షంలో రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. భార‌త్‌తో మూడు బిలియ‌న్ డాల‌ర్ల ర‌క్ష‌ణ ఒప్పందం కుదిరిన‌ట్లు ట్రంప్ తెలిపారు.

అడ్వాన్స్‌డ్ మిలిట‌రీ ఎక్విప్‌మెంట్‌ను భార‌త్ కోనుగోలు చేయ‌నున్న‌ట్లు చెప్పారు. అపాచీ, ఎంహెచ్‌-60 రోమియో హెలికాప్ట‌ర్ల‌ను కూడా ఈ ఒప్పందంలో భాగంగా ఖ‌రీదు చేయ‌నున్నారు. ఆ ఆయుధాల‌తో రెండు దేశాల ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ మ‌రింత బ‌ల‌ప‌డుతుంద‌ని ట్రంప్ అన్నారు. మ‌హిళా వ్యాపార‌వేత్త‌ల‌ను ప్రోత్స‌హించేందుకు త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు.

స‌మాజంలో మాద‌క ద్ర‌వ్యాల‌ను నియంత్రించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఉగ్ర‌వాదంపై పోరాడేందుకు పాకిస్థాన్‌తో క‌లిసి ప‌నిచేస్తున్న‌ట్లు చెప్పారు. భార‌త్ అద్భుతాల‌కు మెలానియా దాసోహం అయ్యింద‌ని, ఇక్క‌డ ప్ర‌జ‌ల ద‌యా హృద‌యం మ‌మ్ముల్ని ఎంతో ఆక‌ర్షించింద‌ని ట్రంప్ అన్నారు. 

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/