వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో మంటలు

గత కొద్దీ రోజులుగా వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ రైల్లో సైతం మంటలు చెలరేగడం మరింత ఆందోళన పెంచుతుంది. భోపాల్ నుండి డిల్లీ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఓ బోగీ బ్యాటరీ బాక్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడం తో అంత ఊపిరి పీల్చుకున్నారు.

ఢిల్లీ వెళ్తున్న రాణి కమలాపతి (భోపాల్)-హజ్రత్ నిజాముద్దీన్ (ఢిల్లీ) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు ఇంజిన్‌కు ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో అప్రమత్తమైన లోకోపైలట్ కుర్వాయి కేథోరా స్టేషన్‌లో రైలును నిలిపివేశాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రైలు ఇంజిన్ వద్ద చెలరేగిన మంటలను అదుపు చేశారు. ఇంజిన్‌కు మంటలు అంటుకోవడంతో రైలు ఆపిన వెంటనే ప్రయాణికులు కిందికి దిగి పక్కనే కూర్చున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.