ఐస్‌క్రీం తిని అస్వస్థతకు గురైన 70 మంది

రాత్రి భోజనాల అనంతరం కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు

70 taken ill after eating ‘spurious’ ice creams in Koraput villages

కోరాపుట్: ఐస్‌క్రీం తిని 70 మంది అస్వస్థతకు గురైన ఘటన ఒడిశాలోని కోరాపుట్ జిల్లా సిమిలిగుడ సమితి దుదారి పంచాయతీలో జరిగింది. శనివారం సాయంత్రం పంచాయతీ పరిధిలోని ఘాట్‌గుడ, సొండిపుట్, అల్లిగాం, కమలజ్వాల, నువ్వాపుట్, బడలిగుడ గ్రామాల్లో ఓ వ్యక్తి ఐస్‌క్రీం విక్రయించాడు. పిల్లలు, పెద్దలు, మహిళలు కొనుగోలు చేసి తిన్నారు. రాత్రి భోజనాలు చేసి నిద్రపోయే సమయంలో ఐస్‌క్రీం తిన్నవారందరూ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు.

కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. దీంతో అప్పటికప్పుడు వారిని దమన్‌జోడి, సునాబెడ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. నిల్వవున్న ఐస్‌క్రీం తినడం వల్ల అది ఫుడ్ పాయిజన్‌గా మారడంతో ఇలా జరిగినట్టు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పొట్టంగి ఎమ్మెల్యే ప్రీతమ్ పాడి బాధితులు చికిత్స పొందుతున్న ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి పరామర్శించారు. చికిత్స అనంతరం కోలుకున్న 60 మందిని నిన్న డిశ్చార్జ్ చేశారు. మిగతా పదిమందికి చికిత్స కొనసాగుతోంది.