రేపటి నుంచి అందుబాటులోకి ‘భారత్‌ రైస్‌’..

భారత్ రైస్ పేరిట రూ.29కే కేజీ బియ్యం ఇచ్చే కార్యక్రమానికి ఫిక్స్ అయ్యింది. రేపు ( ఫిబ్రవరి 6న) ఢిల్లీలో కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్ దీన్ని ప్రారంభించనున్నారు. తొలి విడతలో నాఫెడ్, NCCF, కేంద్రీయ భండార్ విక్రయ కేంద్రాల ద్వారా అమ్ముతారు. ఆ తర్వాత 5, 10 కేజీల బ్యాగుల్లో విక్రయించనున్నారు.

ప్రస్తుతం దేశంలో ప్రతి వస్తువు ధరలు ఆకాశానికి తాకుతున్నాయి. పేద, మధ్యతరగతి ప్రజలు కొని కడుపునిండా కమ్మగా తినలేని పరిస్థితి. ఉప్పు, పప్పు, నూనె, బియ్యం ఇలా వేటి ధరలు చూసినా భగ్గుమంటున్నాయి. ఇక బియ్యం ధరలైతే చెప్పక్కర్లేదు. సాధారణ బియ్యమే రూ.40 పెట్టనిది రావడం లేదు. బియ్యం ధరలకు రెక్కలు రావడంతో కేంద్రం నియంత్రణ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం తాజాగా అతి తక్కువ ధరకే బియ్యం అందించాలని నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేకంగా ‘భారత్‌ రైస్‌’ అనే బ్రాండ్‌ను తీసుకొస్తుంది. ఈ బియ్యం రూ.29కే కిలో అందించేందుకు సిద్ధమైంది.

భారత్ గోదుమపిండిని కేంద్ర ప్రభుత్వం నవంబర్ 06, 2023న ప్రారంభించింది. దేశంలో సగటు గోదుమపిండి ధర రూ.35 ఉండగా.. భారత్ గోదుమపిండి ధర రూ.27.50 కే లభిస్తుంది. శనగ పప్పు కిలో రూ.60కి లభిస్తుంది. భారత్ రైస్ కి సైతం అదే స్థాయిలో ఆదరణ లభిస్తోందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.