బెంగళూరులో భారీ ట్రాఫిక్ జాం..రోడ్లన్నీ రద్దీగా

కిలోమీటర్ దూరం వెళ్లేందుకు 2 గంటల సమయం

Bengaluru Hit By Massive Traffic Jam Ahead of Long Weekend

బెంగళూరు: బెంగళూరులో అసాధారణ ట్రాఫిక్ ఝంజాటం నగర వాసులకు చుక్కలు చూపించింది. నిత్యం ట్రాఫిక్ సమస్యలతో సతమతమయ్యే బెంగళూరు ప్రజల పరిస్థితి బుధవారం గోరుచుట్టుపై రోకలిపోటులా మారింది. నగరంలోని పలు ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవడంతో జనాలు గగ్గోలు పెట్టారు. సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు. ట్రాఫిక్ జాం కారణంగా తమ పిల్లలు ఇంటికొచ్చే సరికి రాత్రి ఎనిమిది గంటలైందని అనేక మంది వాపోయారు.

నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో ఈ ప్రభావం అధికంగా పడింది. మరతహళ్లి, సర్జాపుర, సిల్క్‌బోర్డు రూట్లల్లో ట్రాఫిక్ కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో ఒక కిలోమీటర్ దూరం వెళ్లేందుకు ఏకంగా రెండు గంటలు పట్టిందని నెట్టింట్ కొందరు చెప్పుకొచ్చారు. అప్పటికే ట్రాఫిక్‌లో చిక్కుకున్న వారు ఇతరులను సోషల్ మీడియాలో అప్రమత్తం చేశారు. ఎక్కడిక్కడ వాహనాలు నిలిచిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో పాదచారులకు కూడా స్థలం లేకుండా పోయిందని మరికొందరు చెప్పుకొచ్చారు.

కాగా, ప్రముఖ అమెరికన్ కమెడియన్ ట్రెవర్ నోవా షో ఇందుకు కొంత కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓఆర్ఆర్ ప్రాంతంలో జరుగుతున్న ఈ షో చూసేందుకు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో బయలుదేరారు. అనేక మంది కాస్తంత ముందే ఆఫీసు నుంచి బయలుదేరారు. అయితే, ట్రాఫిక్ జాం కారణంగా ట్రెవర్ నోవా కూడా అరగంట లేటుగా వేదికకు చేరుకున్నారట. ఐబీఐ ట్రాఫిక్ నివేదిక ప్రకారం, నిన్న బెంగళూరు రహదారులపై భారీ సంఖ్యలో వాహనాలు ప్రయాణించాయి. సాధారణంగా వాహనాల సంఖ్య 2 లక్షల వరకూ ఉంటే, బుధవారం ఇది ఏకంగా 3.59 లక్షలకు చేరిందని ఈ నివేదికలో వెల్లడైంది. అనేక ప్రాంతాల్లో వర్షాలు, ఫలితంగా రోడ్లపై నీరు నిలిచిపోవడం, గణేశ్ విగ్రహాల నిమజ్జనం వంటివి కూడా సమస్యను మరింత తీవ్రతరం చేశాయి.