నేటి నుండి బతుకమ్మ సంబరాలు మొదలు

బతుకమ్మ ఉత్సవాలు ఈరోజు నుండి మొదలుకాబోతున్నాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుగొమ్మగా నిలిచి, విశ్వవ్యాప్త ఖ్యాతిని ఆర్జించింది బతుకమ్మ పండుగ. తెలంగాణ ఆడపడుచులు అందరూ ఎంతో సంబరంగా జరుపుకునే ఈ వేడుక ప్రకృతిని ఆరాధిస్తూ, అనుబంధాలను గుర్తుచేస్తూ తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెబుతుంది.

బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ పండుగ ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చిన గత వెయ్యి ఏళ్లుగా బతుకమ్మను ఇక్కడి ప్రజలు తమ ఇంటి దేవతగా పూజిస్తున్నారు. ఎన్నో చరిత్రలు, పురాణాలు మేళవిస్తారు.ఎన్నో చారిత్రక పాటలు పాడుతారు. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి.

ఇక ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాలు అంబరాన్నంటేలా జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పల్లెలతో పాటు.. భాగ్యనగరంలోనూ బతుకమ్మ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. మరోపక్క బతుకమ్మ సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. పుట్టింటికి చేరిన ఆడబిడ్డలు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి, ఆడుతూ పాడుతూ ఆనందోత్సాహాల నడుమ జరిగే బతుకమ్మ వేడుకలు, పల్లెల్లో ప్రత్యేకతను చాటుతాయని అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, తొమ్మిది రోజుల పాటు సాగే ఉత్సవాల సందర్భంగా, రాష్ట్రవ్యాప్తంగా సాంస్కృతిక సంబురం గొప్పగా వెల్లివిరుస్తుందని సీఎం పేర్కొన్నారు.

బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సంస్కృతికి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి పెద్దపీట వేసిందన్నారు. కోటి మంది ఆడబిడ్డలకు ప్రభుత్వం ప్రత్యేకంగా తయారుచేయించిన చీరెలను బతుకమ్మ కానుకగా అందిస్తున్నామని వివరించారు. తెలంగాణ ప్రజల జీవనంలో భాగమైన బతుకమ్మ.. ఖండాంతరాలకు విస్తరించిందని.. తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిందని వివరించారు. ప్రజలను సుఖఃశాంతులతో, ఆయురారోగ్యాలతో దీవించాలని బతుకమ్మను ప్రార్థిస్తున్నట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు.