నేడు ఉప్పల్ స్టేడియంలో భారత్‌ – ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్‌ – ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ నేడు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యా్చ్‌ను తిలకించేందుకు క్రికెట్ అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. తొలి టీ20లో ఓడిపోయిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో గెలుపొంది సిరీస్‌ను సమం చేసింది. ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో ఏ జట్లు గెలిస్తే వారికే సిరీస్ సొంతం అవుతుంది. దీంతో ఈ మ్యాచ్ ఫై ఇరు జట్లు కసిగా ఉన్నాయి. ఈరోజు రాత్రి 7గంటల 30నిమిషాలకు మ్యాచ్ మొదలుకానుంది.

ఉప్పల్ మ్యాచ్‌కు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 2500 మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నారు. 300 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వీటిని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించనున్నారు. గత అనుభవాలతో ఎయిర్‌పోర్టు నుంచి ఆటగాళ్లు స్టేడియం చేరుకునే వరకూ పోలీసులు కట్టదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. సీసీ కెమోరాలను కమాండ్‌ కంట్రోల్‌ రూంతో అనుసంధానం చేసి ప్రతి ఒక్క వ్యక్తి కదలికలను క్షుణ్నంగా పరిశీలించనున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా స్టేడియం వద్ద ఫైర్‌, వైద్య ఆరోగ్య సిబ్బంది సేవలు అందించనున్నారు. ఏడు అంబులెన్సులను కూడా సిద్ధంగా ఉంచారు. అవాంచనీయ సంఘటనలు, ప్రమాదాలు సంభవిస్తే అంబులెన్స్‌ల్లో సమీపంలోని ఆసుపత్రులకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. మూడేళ్ల తరువాత నగరంలో మ్యాచ్‌ జరుగుతుండటంతో పాటు అదివారం కూడా కావడంతో ఈ మ్యాచ్‌కి ప్రాధాన్యత ఏర్పడింది.