సిఎం పదవికి రాజీనామా చేయనున్న బసవరాజు బొమ్మై

ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ రాజీనామా

basavaraj-bommai-to-resign-as-cm-today-evening

బెంగళూరుః ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఈరోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో ఫలితాలు వెల్లడైన తర్వాత సీఎం.. గవర్నర్‌కు రాజీనామా పత్రం సమర్పించనున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బిజెపి ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. మొత్తం 224 స్థానాలకు గానూ ఇప్పటి వరకు 43 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. మరో 21 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్‌ ఫిగర్‌ కంటే ఎక్కువ స్థానాల్లోనే విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు 92 స్థానాల్లో గెలుపొందిన హస్తం పార్టీ.. మరో 44 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది.

కాగా, ఎన్నికల్లో ఓటమికి సీఎం పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం తాము శక్తివంచన లేకుండా శాయశక్తులా కృషి చేశామని, అయినా విజయం సాధించడంలో విఫలమయ్యామని అన్నారు. తాము ఓటమిని అంగీకరిస్తున్నామని చెప్పారు. పూర్తి ఫలితాలు వెల్లడైన తర్వాత తాము సమగ్ర విశ్లేషణ చేసుకుంటామని, లోపాలను సరిదిద్దుకుని లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధిస్తామని అన్నారు.