బీఆర్ఎస్‌ కీలక నేత, సెస్ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి మృతి

సిరిసిల్ల బీఆర్ఎస్‌ కీలక నేత, సెస్ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి అనారోగ్యం తో కన్నుమూశారు. లక్ష్మారెడ్డి మృతి పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. విదేశీ పర్యటనలో ఉన్న తనకు లక్ష్మారెడ్డి గారి మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. లక్ష్మారెడ్డి తో తనకున్న అనుబంధాన్ని కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. పార్టీ అభివృద్ధికి, సెస్ మనుగడ కు విశేష కృషి చేసిన లక్ష్మారెడ్డి మృతి బాధాకరమని ఆయన అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు తన సానుభూతిని ప్రకటించారు.

ప్రస్తుతం కేటీఆర్ లండన్ పర్యటన లో ఉన్నారు. పెట్టుబడులను ఆకర్షించ‌డానికి పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్.. లండన్‌లో జరిగిన ‘ఐడియాస్‌ ఫర్‌ ఇండియా’ సదస్సులో పాల్గొన్నారు. తొమ్మిదేండ్ల తెలంగాణ విజయగాథను ఉద్వేగభరితంగా వివరించారు. ఉపాధి కల్పన, ఔత్సాహిక పారిశ్రామిక రంగాల్లోని అవకాశాలను అందిపుచ్చేకునేలా యువతను తయారుచేసినప్పుడే మనదేశ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

భారతదేశ విజయవంత స్టార్టప్ రాష్ట్రం-తెలంగాణ విజయగాథను వివరించిన మంత్రి కేటీఆర్, కేవలం తొమ్మిదేండ్ల‌లోనే విప్లవాత్మక ప్రగతితో అగ్రగామి రాష్ట్రంగా మారిందన్నారు. వ్యవస్థాగత సమస్యలను పరిష్కారంతోనే ఆయా రంగాల్లో విప్లవాత్మక మార్పును సాధించామన్నారు. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచిన విధానంతో పాటు వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఐదు విప్లవాలకు నాంది పలికిన తీరును మంత్రి కేటీఆర్ వివరించారు.