మాజీ మంత్రి గంటా ఆస్తుల వేలం..?

ganta-srinivasa-rao

టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలానికి ఇండియన్ బ్యాంక్ సిద్ధమైంది. గంటా, ఆయన బంధువులు కలిసి బ్యాంకులో తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో ఆస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ చేసింది. రూ.390.7 కోట్ల రుణం చెల్లించలేదని నోటీసుల్లో పేర్కొంది. పద్మనాభం మండలం అయినాడ వద్ద గంటాకు చెందిన స్థిరాస్తిని స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలిపింది. వచ్చే నెల 16న వేలం వేయనున్నట్లు వెల్లడించింది. గ౦టాకి చెందిన ప్రత్యూష కంపెనీ ఆస్తులను వేలం వేయాలని ఇండియన్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యూష కంపెనీలోని తొమ్మిది రకాలైన ఆస్తులకు వేలం జరగనుంది. గతంలో రూ. 248 కోట్ల రూపాయల మేర ప్రత్యూష క౦పెనీ బ్యాంక్ రుణం తీసుకుంది. ఆ లోన్ తాలూకా వడ్డీలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి.

మెుదటిసారిగా 2006 అక్టోబర్ 4న రుణ౦ చెల్లి౦చాల౦టూ బ్యాంకు కంపెనీకి నోటీసులు జారీ చేసింది. సమాధానం రాని క్రమంలో.. 2006 డిసెంబర్ 27న, తిరిగి 2017 ఫిబ్రవరి 21న బ్యాంకులో ప్రత్యూష కంపెనీ కుదవ బెట్టిన ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖలోని కీలకమైన ప్రాంతాలలో ఉన్న భవనాలు, రుషికొండ వద్ద ఉన్న స్థలాలు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నాయి. ఇక ఇప్పుడు మరోసారి వేలం వేసేందుకు బ్యాంకు సిద్ధమైంది.