ఏపీ కొత్త మంత్రుల శాఖల వివరాలు..?

మరికాసేపట్లో ఏపీ లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం జరగబోతుంది. మొత్తం 25 మందితో కూడిన సభ్యుల జాబితా ఆదివారం ప్రకటించారు. వీరిలో 11 మంది పాత మంత్రులు, 14 మంది కొత్త వారితో కొత్త కేబినెట్ ఏర్పటు చేసారు. కాగా మంత్రులకు శాఖల కేటాయింపుపై జగన్ కసరత్తు చేస్తున్నారు. పాత మంత్రుల్లో కొందరికి పాత శాఖలు కేటాయించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. గతంలో మాదిరిగానే ఎస్సీ మహిళకే హోం శాఖ అంటూ ప్రచారం జోరుగా నడుస్తుంది. దీంతో తానేటి వనితకు హోం మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్ధిక శాఖ మంత్రిగా బుగ్గన రాజేంద్ర నాథ్‌ రెడ్డి , ధర్మాన ప్రసాదరావుకు రెవెన్యూతో పాటు మరో కీలక శాఖ అప్పగించే అవకాశం ఉంది. రోజాకు ఏ శాఖ ఇస్తారనేది చూడాలి. కాకానికి వ్యవసాయం.. లేదా మరో కీలక శాఖ అని అంటున్నారు. మంత్రుల శాఖల విషయంలో మధ్యాహ్నం లేదా సాయంత్రానికి క్లారిటి వచ్చే అవకాశం ఉంది.

గతంలో లానే ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కనున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు వర్గాలకు ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. మైనారిటీ నుంచి అంజాద్ బాషా డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉండగా… ఎస్టీ వర్గం నుంచి పీడిక రాజన్న దొర కానున్నారు. ఎస్సీ నుంచి నారాయణ స్వామి లేదా పినెపి విశ్వరూప్ లేదా వనిత కానుండగా.. బీసీ నుంచి ధర్మాన ప్రసాదరావు లేదా బొత్సకు ఛాన్స్ ఉంది. కాపు సామాజిక వర్గం నుంచి అంబటి రాంబాబు లేదా దాడిశెట్టి రాజాకు అవకాశం ఉన్నట్లు వినికిడి.

మరోపక్క మరోసారి క్యాబినేట్ లో ఛాన్స్ రాకపోయేసరికి పలువురు మాజీ మంత్రులు జగన్ ఫై ఆగ్రహం గా ఉన్నారు. ఇప్పటికే మేక‌తోటి సుచ‌రిత‌ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణకు లేఖ అందజేశారు. మరికొంతమంది మీడియా ముందే కన్నీరు పెట్టుకోవడం చేస్తున్నారు. ఇక తమ ఎమ్మెల్యే కు పదవి రాకపోవడం తో అభిమానులు రోడ్ల ఫై నిరసనలు చేస్తున్నారు. మొత్తం మీద కాబినెట్ విస్తరణ అనేది జగన్ కు పెద్ద తలనొప్పిగా మారబోతుందనేది స్పష్టంగా తెలుస్తుంది. దీనిని తెలుగుదేశం పార్టీ క్యాష్ చేసుకుంటుందో చూడాలి.