బిఆర్ఎస్ తో కలిసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందిః బండి సంజయ్

కాంగ్రెస్ ఉనికి ఎక్కడా లేదని వెల్లడి

bandi-sanjay-reacts-to-komatireddy-comments

హైదరాబాద్‌ః ఈసారి తెలంగాణలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని, సంకీర్ణం వస్తుందని, కెసిఆర్ కాంగ్రెస్ తో కలవక తప్పదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. దీనిపై తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ స్పందించారు. బిఆర్ఎస్ తో కలవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్టుందని అన్నారు. కాంగ్రెస్ ఉనికి ఎక్కడా లేదని తెలిపారు. తెలంగాణలో బిజెపి బలపడుతోందని బండి సంజయ్ స్పష్టం చేశారు. అందుకే బిజెపిని కెసిఆర్ టార్గెట్ చేశారని వివరించారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులతో కలిసి బిఆర్ఎస్ పోటీ చేస్తుందని అన్నారు. బిజెపి భయంతోనే బిఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటవుతున్నాయని విమర్శించారు. అధికారంలోకి రాలేమని కాంగ్రెస్సే చెబుతోందని బండి సంజయ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న యాత్రలతో ఎలాంటి ఉపయోగం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల వరకు తన్నుకుని, అప్పుడు కలిసి పోటీ చేస్తారని ఎద్దేవా చేశారు.