బిజెపిలోకి పొంగులేటి రాక ఫై బండి సంజయ్ స్పందన

బిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ కు గురైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..ఏ పార్టీ లో చేరబోతారనేది సస్పెన్స్ గా మారింది. కొంతమంది బిజెపిలోకి వెళ్తారంటే..మరికొంతమంది కాంగ్రెస్ లోకి వెళ్తారని మాట్లాడుకుంటున్నారు. ఈ తరుణంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ..పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలోకి వస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించారు.

కుటుంబ పాలన పోవాలంటే బీజేపీ రావాలన్నారు. పొంగులేటితో ఈటల బృందం భేటీ విషయమై తనకు సమాచారం లేదన్నారు. తనకు చెప్పకపోవటం తప్పేమీ కాదన్నారు. పార్టీలో ఎవరి పనులు వారు చేసుకుంటూ వెళ్తారన్నారు. తనకు తెలిసిన వారితో తాను.. ఈటలకు తెలిసిన వారితో ఆయన మాట్లాడుతున్నామని బండి సంజయ్ తెలిపారు.

కొండా విశ్వేశ్వరరెడ్డి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రఘునందనరావు మరికొందరు బీజేపీ నాయకులు నేడు పొంగులేటిని తమ పార్టీలోకి ఆహ్వానించనున్నారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంటిలో లంచ్ మీటింగ్‌కు నేతలు హాజరుకానున్నారు. ఇప్పటికే పలుమార్లు బీజేపీ చేరికల కమిటీ నేతలు పొంగులేటిని కలిశారు. నేడు పొంగులేటి పార్టీ మార్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.