ప్రగతి భవన్ సీసీ ఫుటేజ్ బయట పెట్టాలి..బండి సంజయ్

హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం పై బిజెపి తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బిజెపి వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని ఆగ్రహం వ్యక్తంచేశారు. మునుగోడులో ఓడిపోతామన్న భయంతో టీఆర్ఎస్.. సీఎం కేసీఆర్ డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బిజెపిపై వస్తున్న ఆరోపణలపై టీఆర్‌ఎస్‌పై బిజెపి చార్జిషీట్‌ దాఖలు చేస్తుందని పేర్కొన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారం జరగిందని.. సీసీ టీవీ పుటేజీలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఏ ఎమ్మెల్యేలైతే ఉన్నారో.. వాళ్ల నెత్తిపై రూపాయి పెడితే అర్ధ రూపాయికి కూడా ఎవరూ కొనేందుకు సిద్ధంగా లేరంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. వాళ్లను కొనాల్సిన ఖర్మ కూడా బిజెపికి లేదు. భవిష్యత్తులో పార్టీలోని ఎమ్మెల్యేలు చేజారకుండా కాపాడుకోవడానికి కేసీఆర్ ఈ స్కెచ్ వేశారని తెలిపారు.కేసీఆర్ కు దక్కన్ కిచెన్ హోటల్ గత 3, 4 రోజుల సీసీ ఫుటేజీని పూర్తిగా విడుదల చేసే దమ్ముందా? ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే రోజూ ప్రగతి భవన్ కు ఉదయం వెళ్లి రాత్రి వరకు ఉంటున్నారు.. దమ్ముంటే ప్రగతి భవన్ సీసీ పుటేజీలన్నీ విడుదల చేస్తే వాస్తవాలన్నీ బయటకు వస్తాయని తెలిపారు.

కేసీఆర్ కుటుంబంతోనే వ్యాపార సంబంధాలు, వారి ఫామ్ హౌసే, ఎమ్మెల్యేలు వారే, బాధితులు వారే అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రగతి భవన్ సీసీ ఫుటేజ్ బయట పెట్టాలి.. సీపీ, నలుగురు ఎమ్మెల్యేల కాల్ లిస్టు బయట పెట్టాలి అంటూ డిమాండ్ చేశారు. హైకోర్టును ఆశ్రయిస్తాం, చట్టాన్ని నమ్ముతాం.. వదిలేది లేదు దీనిపై సీబీఐ విచారణ జరగాలని బండి పేర్కొన్నారు. పైసలు దొరికితే చూపించాలి… అందులో ఉన్నవి పైసలా, బాంబులా అంటూ ప్రశ్నించారు. మునుగోడు ఎన్నికను రద్దు చేసేందుకు టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోందని.. ఒక్క ఉప ఎన్నికకే చిల్లర వేషాలు.. బీఆర్ఎస్ తో ఏం చేస్తారో అంటూ మండి పడ్డారు. స్క్రిప్ట్ ఫెయిల్ అయిందని.. టీఆర్ఎస్ నాయకులే నవ్వుకుంటున్నారన్నారు. ఏమి చెబితే ఏమైతుందోనని ఎమ్మెల్యేలు భయపడుతున్నారని తెలిపారు. కుట్రలు జరిగే ప్రగతి భవన్ లో కోచింగ్ ఇప్పించి ఎమ్మెల్యేలతో చెప్పిస్తారని విమర్శించారు. రేపు యాదాద్రి 9 గంటలకు వస్తా…. తప్పు చేయకపోతే యాదాద్రికి వచ్చి ప్రమాణం చేయాలి అని బండి సంజయ్ సవాల్ చేశారు. దీనిపై కోర్టును, ఎన్నికల కమీషన్ ను ఆశ్రయిస్తామని బండి సంజయ్ తెలిపారు. కోర్టు నిర్ణయం శిరాసావహిస్తామని తెలిపారు.