మోడీ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై పార్టీ ముఖ్య నేతలతో బండి సంజయ్ సమావేశం

ఈ నెల 12 న రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో పార్టీ నేతలతో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సమావేశమయ్యారు. రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌)ను జాతికి అంకితం చేసేందుకు మోడీ రామగుండానిక రానున్నారు. ఈ క్రమంలో అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్, జాతీయ కార్యవర్గ సభ్యులు జీ. వివేక్ వెంకటస్వామితో పాటు జిల్లా అధ్యక్షులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.

గతంలో మూతబడిన రామగుండం ఎఫ్‌సీఐ పునరుద్ధరణకు కేంద్రం చర్యలు తీసుకుంది. మొత్తం రూ. 6,120 కోట్లతో కేంద్ర ప్రభుత్వం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునర్నిర్మాణం చేసింది. బేగంపేట ఎయిర్ పోర్ట్ కు ప్రత్యేక విమానంలో రానున్న ప్రధాని.. అక్కడి నుంచి హెలికాప్టర్‌ లో రామగుండం చేరుకుంటారు. ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రధాని పర్యటన కారణంగా రాష్ట్ర ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.

మరోపక్క తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను అత్యంత పకడ్బందీగా చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వేదికల వద్ద సెక్యూరిటీ, శాంతి భద్రతల విషయంలో రాజీ పడకూడదని చెప్పారు. అయితే ప్రధాని మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ హాజరవుతారా..? లేదా..? అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.