ముంబై జేజే హాస్పిటల్ లో బయటపడ్డ 132 నాటి సొరంగం

మహారాష్ట్ర రాజధాని ముంబై లోని జేజే హాస్పిటల్ ప్రాంగణంలో 132 ఏళ్ల నాటి సొరంగం బయటపడింది. నీటి లీకేజీని అరికట్టేందుకు తవ్వకాలు జరుపుతుండగా ఈ రహస్య సొరంగం బయటపడినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. ఈ భవనం కింద 200 మీటర్ల పొడవైన సొరంగాన్ని రెండు రోజుల కిందట గుర్తించారు. శిలా ఫలకంపై 1890 అని ఉంది. దీంతో ఈ సొరంగాన్ని 132 ఏళ్ల కిందట నిర్మించినట్లు తెలుస్తోంది.

ఈ రహస్య సొరంగాన్ని గుర్తించిన వెంటనే హాస్పిటల్ అధికారులు ఆ సమాచారాన్ని జిల్లా కలెక్టరుకు, పురావస్తు శాఖ అధికారులకు తెలిపారు. 1845లో నాటి బ్రిటీష్‌ పాలనలో ప్రారంభించిన చారిత్రక వైద్య కాలేజీ భవనం కింద రహస్య మార్గం ఉండవచ్చని ప్రచారం ఉందని, దీనిని బట్టి అది ఇదే కావచ్చని అధికారులు భావిస్తున్నారు. గ్రాంట్ మెడికల్ కాలేజ్, సర్‌ జేజే గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌ను జేజే హాస్పిటల్స్ అని పిలుస్తారు. మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అతి పురాతన వైద్య సంస్థ ఇది. మహిళలు, పిల్లలకు చికిత్సలు అందించిన వార్డు భవనాన్ని అనంతరం నర్సింగ్‌ కాలేజీగా మార్చడం జరిగింది.