రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ

Bandi Sanjay letter to Revanth Reddy

హైదరాబాద్‌ః తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కరీంనగర్ ఎంపీ, బీజేపీ నేత బండి సంజయ్ శనివారం బహిరంగ లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సీబీఐ విచారణ కోరాలని అందులో పేర్కొన్నారు. తెలంగాణలోకి సీబీఐని నిషేధిస్తూ గత ప్రభుత్వం జీవో తీసుకు వచ్చిందని… దీనిని రద్దు చేయాలని ఆయన కోరారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కేసీఆర్, కేటీఆర్ నడిపించారని ఆరోపించారు. ఈ కేసులో వారికి నోటీసులు ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోందని వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ ఓడిపోయాక ఫోన్ ట్యాపింగ్ పరికరాల ధ్వంసం పేరుతో దేశ భద్రతకు, ఉగ్రవాదులకు సంబంధించిన కీలకమైన సమాచార డేటాను కూడా ధ్వంసం చేశారన్నారు. వ్యాపార సంస్థలు ప్రతిపక్షాలకు విరాళాలు ఇవ్వకుండా ఫోన్ ట్యాపింగ్ ను వాడుకున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ ప్రధాన సూత్రధారి ప్రభాకర్ రావు అమెరికాలో తలదాచుకున్నా ఎందుకు స్వదేశానికి రప్పించలేకపోయారన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై వాస్తవాలు నిగ్గు తేలాలంటే సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు జోక్యం అనివార్యం అన్నారు. మీరే సీబీఐ విచారణ జరపాలని కేంద్రానికి లేఖ రాయండన్నారు.

రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా గత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని కోరారు. ప్రతిపక్షాలపై సైబర్ దాడికి కారకుడైన మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ లకు నోటీసులిచ్చి విచారణ జరిపి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి రాజ్యాంగ హక్కులనే ఉల్లంఘించిన కేసీఆర్ ను, కేటీఆర్ లు ఎమ్మెల్యే పదవులకు అనర్హులు అని తెలిపారు. తెలంగాణ శాసనసభా నాయకుడిగా ఉన్న మీరు కేసీఆర్, కేటీఆర్ లను అనర్హులుగా ప్రకటించే విషయంపై స్పీకర్ కు లేఖ రాయాలన్నారు.