రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వైఖరి ఫై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆగ్రహం

మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల వెల్లడిలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వైఖరి అనుమానాస్పదంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. టీఆర్ఎస్ లీడ్‌లోకి వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను అప్‌డేట్‌ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.

బీజేపీ లీడ్‌లోకి వచ్చినప్పటికీ ఫలితాలను సీఈవో వెల్లడించడం లేదని అన్నారు. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యానికి కారణమేంటో చెప్పాలని డిమాండ్‌ చేశాడు. ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఎన్నడూ లేని ఆలస్యం ఇప్పుడే ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. ఫలితాల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

అలాగే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌తో ఫోన్లో బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడారు. ఫలితాలు వెల్లడించడంలో ఎందుకు ఆలస్యం అవుతుంది అని ప్రశ్నించారు. మునుగోడులో జరిగిన దాడులు, మద్యం పంపిణీ, డబ్బులు పంపిణీ అంతా ఎన్నికల కమిషన్ మీద రాంగ్ ఒపీనియన్ వచ్చింది. ఫలితాలు సక్రమంగా వెల్లడించండి. గెలుపు, ఓటములు సహజం కానీ మీ మీద మచ్చ తెచ్చుకోకుండా ఉండండని వికాస్ రాజ్‌కు సూచించారు.

ప్రస్తుతం ఏడో రౌండ్‌ ముగిసేసరికి టీఆర్‌ఎస్‌ 2555 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఏడో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 7189, బీజేపీకి 6803 ఓట్లు వచ్చాయి.