అధికారంలోకి వస్తే 15 నిమిషాల సమయాన్ని విద్యుత్ సిబ్బందికి అప్పగిస్తా

రైతుల పొలాలకు కరెంట్ ఇవ్వని దుర్మార్గుడు కేసీఆర్..బండి సంజయ్

హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కెసిఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతుల పొలాలకు కరెంట్ ఇవ్వకుండా ఎండబెడుతున్న దుర్మార్గుడు కేసీఆర్ అని మండిపడ్డారు. హైదరాబాద్ పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేయడం లేదని… దీంతో, కరెంట్ బకాయిలు వెయ్యి కోట్లకు పెరిగిపోయాయని అన్నారు. 15 నిమిషాలు టైమ్ ఇస్తే హిందువులను నరికి చంపుతామని ఎంఐఎం నేతలు గతంలో అన్నారని… ఇప్పుడు తాను చెపుతున్నానని… బీజేపీ అధికారంలోకి వస్తే 15 నిమిషాల సమయాన్ని విద్యుత్ సిబ్బందికి అప్పగిస్తామని… గల్లీగల్లీని జల్లెడ పట్టించి, పాత బకాయిలతో సహా విద్యుత్ బిల్లులను వసూలు చేస్తామని చెప్పారు.

ఇప్పటికే అనేక బాధలు పడుతున్న ప్రజలపై కేసీఆర్ రూ. 6 వేల కోట్ల భారం మోపారని బండి సంజయ్ అన్నారు. మే నెల నుంచి కరెంట్ బిల్లులు రెట్టింపు కాబోతున్నాయని చెప్పారు. రూ. 60 వేల కోట్ల బకాయిలు ఉన్న డిస్కమ్ లను పూర్తిగా సంక్షోభంలోకి నెట్టిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. ఓట్లు, సీట్లు కొనేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే కేసీఆర్.. రైతులు కష్టించి పండించిన వరి ధాన్యాన్ని కొనేందుకు మాత్రం ముందుకు రావడం లేదని విమర్శించారు. ప్రజల కోసం పోరాడుతున్న వందలాది మంది బీజేపీ కార్యకర్తలను జైళ్లలో పెట్టారని మండిపడ్డారు.

భైంసాలో 12 మంది కార్యకర్తల ఇళ్లు కొందరు తగలబెడితే ఒక్క రూపాయి కూడా కేసీఆర్ ఇవ్వలేదని అన్నారు. ఎంఐఎంకి కొమ్ము కాస్తూ లౌకికవాదులమని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబం చేసిన త్యాగమేందని ప్రశ్నించారు. ఏనాడైనా ఒక్క లాఠీ దెబ్బ తినడం కానీ, జైలుకు పోవడం కానీ జరిగిందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనను చూసి అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని చెప్పారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/