కుటుంబ సమేతంగా ప్రధాని మోడీని కలిసిన బండి సంజయ్

Bandi Sanjay Along With Family Meet PM Narendra Modi

న్యూఢిల్లీః బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. కుటుంబ సభ్యులతో పాటు వెళ్లి ప్రధానితో కాసేపు ముచ్చటించారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తర్వాత తొలిసారి ప్రధానితో భేటీ అయ్యారు బండి సంజయ్. ఈ సందర్భంగా బండి సంజయ్ పార్టీకి చేసిన సేవలను మోడీ కొనియాడారు. అనతికాలంలోనే పార్టీకి జోష్ తెచ్చారని ప్రశంసించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. తెలంగాణలో బిజెపి బలోపేతానికి ఎంతగానో కష్టపడ్డారని బండి సంజయ్ ను అభినందించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సి ఉన్నందున మరింత కష్టపడి పనిచేయాలని సూచించారు. అందర్ని కలుపుకుని ముందుకు సాగుతూ.. ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగడంతోపాటు వారి యోగ క్షేమాలను మోడీ అడిగి తెలుసుకున్నారు. బండి సంజయ్ తనయులతో మోడీ చాలా సేపు మాట్లాడి వాళ్లు ఏం చదవుతున్నారు వంటి వివరాలు తెలుసుకున్నారు.

కాగా, ఆగస్టు 4 ఢిల్లీలోని బిజెపి సెంట్రల్ ఆఫీసులో పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీగా బండి సంజయ్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం అదే రోజు మధ్యాహ్నం భాగ్యనగరానికి వస్తారు. ఆయనకు గ్రాండ్ వెల్‌కమ్ పలికేందుకు పార్టీ లీడర్స్, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు.