కందుకూరు ఘటన మనసు కలచివేసిందన్న బాలకృష్ణ

నెల్లూరు జిల్లా కందుకూరులో విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో బుధవారం రాత్రి జరిగిన బహిరంగ సభకు భారీగా కార్యకర్తలు రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ తోపులాటలో దాదాపు ఎనిమిది మంది మరణించారు. ఇక పదుల సంఖ్యలో గాయాలు కావడంతో హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఘటన పట్ల సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. కందుకూరు ఘటన మనసు కలచివేసిందన్నారు.

ఎనిమిది మంది మరణించారన్న వార్త 80 లక్షల మంది కార్యకర్తల కుటుంబాల్లో విషాదం నింపిందని పేర్కొన్నారు. కార్యకర్తల మృతి మనసును కలచివేసిందని తెలిపారు. పార్టీ జెండా మోసే కార్యకర్తల పాడె మోయాల్సి రావడం అత్యంత బాధాకరమని బాలకృష్ణ వివరించారు. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని వెల్లడించారు. ఇక ఘటన జరిగిన వెంటనే చంద్రబాబు సభను అర్ధాంతరంగా నిలిపివేసి హాస్పటల్ కు వెళ్లి బాధితులను పరామర్శించారు. జరిగిన సంఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. బాధితుల పిల్లలను ఎన్టీఆర్‌ ట్రస్టు విద్యాసంస్థల్లో ఉచితంగా చదివిస్తామని హామీ ఇచ్చారు. అలాగే కేంద్రం తో పాటు రాష్ట్ర ప్రభుత్వం సైతం మృతుల కుటుంబాలకు ఆర్ధిక సాయం ప్రకటించారు.