చంద్రబాబుని జైల్లో పెట్టాలన్నదే జగన్‌ జీవిత లక్ష్యం: బాలకృష్ణ

ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని బాలయ్య మండిపాటు

balakrishna-fires-on-jagan-after-chandrababu-arrest

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ పై బాలకృష్ణ నిప్పులు చెరిగారు. జగన్ పాలకుడు కాదని… ఆయనొక కక్షదారుడని విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి కక్ష సాధింపులకు పాల్పడే ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని అన్నారు. తాను 16 నెలలు జైల్లో ఉన్నాను, చంద్రబాబు నాయుడుని 16 నిమిషాలైనా జైల్లో పెట్టాలన్నదే తన జీవిత లక్ష్యమన్నట్టుగా జగన్ కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడిని ఏ చట్టం ప్రకారం అరెస్ట్ చేశారు? అని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్ మెంట్ పెద్ద కుంభకోణమని ప్రచారం తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు. ఇది కావాలనే రాజకీయ కక్షతో చేస్తున్న కుట్ర అని చెప్పారు.

19.12.2021 లో ఎఫ్ఐఆర్ నమోదైందని, నిజంగా అవినీతి జరిగి ఉంటే ఇంతవరకు ఎందుకు ఛార్జ్ షీట్ వేయలేదని బాలయ్య ప్రశ్నించారు. డిజైన్ టెక్ సంస్ధ అకౌంట్ లు ప్రీజ్ చేసి నిధులు స్తంభింపజేసినప్పుడు కోర్టు మీకు చివాట్లు పెట్టి ఆ డబ్బు నేరానికి సంబంధించింది కాదని ఆదేశాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా? 2.13 లక్షల విద్యార్థులకు శిక్షణ ఇచ్చి 72 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారని, దీనిని కుంభకోణం అని ఏ విధంగా అంటారని స్వయంగా హైకోర్టు చెప్పలేదా? అని అడిగారు. మళ్లీ తప్పుల మీద తప్పులు చేసి కోర్టుల చేత ఎందుకు తిట్లు తింటారని అన్నారు. జగన్ సీఎం అయ్యాక అన్నం తినటం మానేసి కోర్టుల చేత చివాట్లు తింటున్నారని ఎద్దేవా చేశారు. ఎలాంటి అవినీతి లేని కేసులో రాజకీయ కుట్రతోనే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారని… ఇలాంటి అక్రమ అరెస్టులకు భయపడేది లేదు, దీనిపై న్యాయపోరాటం చేస్తాం, ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటామని అన్నారు.