అయ్యన్నపాత్రుడికి బెయిల్..

tdp-protests-against-ayyanna-patrudu

అయ్యన్న పాత్రుడి తో పాటు ఆయన కుమారుడు రాజేష్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండు సెంట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణపై ఫోర్జరీ ఎన్‌ఓసీ సమర్పించారని ఆరోపిస్తూ సీఐడీ అధికారులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన చిన్న కుమారుడు రాజేష్‌లను గురువారం తెల్లవారుజామున నర్సీపట్నంలో ఆయన ఇంట్లోకి వెళ్లి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వారిని విశాఖపట్నంలోని సీఐడీ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఆయన్ను రిమాండ్‌కు ఇవ్వాలని కోరుతూ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరిచారు. కాగా విచారణ విన్న న్యాయమూర్తి అయ్యన్నను పోలీసు రిమాండ్‌కు ఇవ్వడానికి తిరస్కరించారు.

41ఏ నోటీసులు ఇచ్చిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకునే వీలు ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. అయ్యన్నపాత్రుడిని ఉద్దేశ్యపూర్వకంగా జైల్లో పెట్టాలని అరెస్ట్ చేసినందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అయ్యన్నపాత్రుడు తరపు న్యాయవాదులు కోరారు. అయితే కేసు డైరీని చూసి నిర్ణయం తీసుకుంటామని..కేసు డైరీని సమర్పించాలని సిఐడి అధికారులను కోర్టు ఆదేశించింది. ఉదయం పదిన్నరకల్లా కేసు డైరీ సమర్పించాలని న్యాయమూర్తి సీఐడీకి ఆదేశాలు జారీ చేశారు.