మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్ భారీ విజయం సాదించబోతున్నారు – బండి సంజయ్

మునుగోడు ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారీ మెజార్టీ తో విజయం సాదించబోతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా పూర్తి అయ్యింది. కొన్ని కొన్ని చోట్ల కాస్త ఘర్షణలు చోటుచేసుకున్నప్పటికీ అంత సవ్యంగానే జరిగింది. కాగా ఈ ఉప ఎన్నిక ఫై బండి సంజయ్ స్పందించారు.

మునుగోడు లో టిఆర్ఎస్ పార్టీ రూ.1000 కోట్లకు పైగా ఖర్చు పెట్టారని..డబ్బు, మద్యం పంచి ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని బండి సంజయ్ ఆరోపించారు. బులెన్స్, పోలీస్ వాహనాల్లోనే టీఆర్ఎస్ నేతలు డబ్బు పంపిణీ చేశారని, వారికి పోలీసులు సహకరించారని మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు డబ్బు పంచుతున్నారని కంప్లైంట్ ఇస్తే ఎన్నికల సంఘం పట్టించుకోలేదని విమర్శించారు. ఎన్నికల అధికారులు కేసీఆర్ జేబు మనుషులుగా మారిపోయారని , ఎన్నికల అధికారుల పక్షపాత వైఖరిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ నాయకులు ఎన్ని ప్రలోభాలకు గురి చేసిన రాజగోపాల్ రెడ్డి అఖండ విజయం సాధించబోతున్నారని ధీమా వ్యక్తం చేసారు.

ఇక పోలింగ్ సమయం ముగిసినా.. ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరి ఉండటంతో.. వారిని ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఓటర్లు క్యూలో నిలబడి ఉన్నారు. ఉద‌యం 7 గంట‌ల‌కు పోలింగ్ ప్రారంభమైంది. మ‌ధ్యాహ్నం వ‌ర‌కు మంద‌కొడిగా సాగిన పోలింగ్.. ఆ త‌ర్వాత పుంజుకుంది. సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు 77.55 శాతం పోలింగ్ న‌మోదైంది. చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓట‌ర్లు బారులు తీరారు. మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో 2,41,805 ఓట్లు ఉండ‌గా, ఇప్ప‌టి వ‌ర‌కు 1,87,527 ఓట్లు పోలైన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. చౌటుప్ప‌ల్, నారాయ‌ణ‌పురంలో భారీగా పోలింగ్ న‌మోదైంది.