పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులు..

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిగాయి. పంజాబ్ ప్రావిన్స్ లో ర్యాలీ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ కాలికి బుల్లెట్ గాయమైంది. పాకిస్థాన్‌లోని వజీరాబాద్‌లో ఇమ్రాన్ ఖాన్ కంటైనర్ ట్రక్కుపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తుండగా దుండగులు పీటీఐ నేతలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్‌తో పాటు ఆయన అనుచరులకు కలిపి మొత్తం నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని సురక్షితంగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అందరూ క్షేమంగానే ఉన్నారని తెలుస్తోంది.

ముందస్తు ఎన్నికలు చేపట్టాల్సిందిగా పాకిస్థాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే క్రమంలో తన పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఇమ్రాన్ ఖాన్ భారీ ర్యాలీ చేపట్టారు. ఇమ్రాన్ ఖాన్ భారీ సంఖ్యలో కార్లు ఉన్న కాన్వాయ్‌తో వజీరాబాద్ వైపు నుంచి ఇస్లామాబాద్ వైపు వెళ్తుండగా దుండగులు కాల్పులకు తెగబడ్డారు. కాగా.. 2007 లో జరిగిన ర్యాలీలో పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి బెనజీర్ భుట్టో ను కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం జరిగిన కాల్పులు తీవ్ర సంచలనంగా మారాయి. కాల్పులు జరిగిన తర్వాత గందరగోళ దృశ్యాలు చోటు చేసుకున్నాయి. ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిపిన దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.