మూడు రోజులపాటు జరుగనున్న అసెంబ్లీ సమావేశాలు

bac-decided-to-run-ts-assembly-for-three-days

హైదరాబాద్‌: స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై జరిగిన బీఏసీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా సమావేశాల నిర్వహణతోపాటు పలు అంశాలపై చర్చించారు. ప్రభుత్వం తరఫున మంత్రులు హరీశ్‌ రావు, ప్రశాంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ నుంచి మల్లు భట్టి విక్రమార్క, ఎంఐఎం తరఫున అక్బరుద్దీన్‌ ఒవైసీ పాల్గొన్నారు. ఈ భేటీలో మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. ఈ సందర్భంగా ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించాలని విపక్షాలు కోరాయి. అయితే పని దినాలు కాదు, పని గంటలపై చూడాలని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. భారీ వర్షాలు, వరదలు, ప్రభుత్వ చర్యలపై చర్చించాలని నిర్ణయించారు. సమావేశాల్లో ప్రభుత్వం దాదాపు పది బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. శుక్రవారం వరదలు, శనివారం పలు బిల్లులపై చర్చించనున్నారు.

కాగా, అయితే ప్రభుత్వ నిర్ణయంతో కాంగ్రెస్ ఏకీభవించలేదు. కనీసం 20 రోజుల పాటైనా సమావేశాలు నిర్వహించాలని కోరింది. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయని, ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. మరోవైపు.. అసెంబ్లీలో చర్చ సజావుగా సాగేలా చూడాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కోరారు. ఇండియా కూటమి పేరిట పార్లమెంట్ జరగనివ్వడం లేదని గుర్తు చేశారు.